ఆవుల షెడ్డులో దూరిన చిరుత: వెంబడిస్తే టాయ్‌లెట్‌లో దాక్కుంది
తిరునల్వేలి: ఓ చిరుత పులి ఇళ్లల్లోకి ప్రవేశించి భయాందోళనకు గురి చేసింది. చివరకు అటవీశాఖ అధికారులు దాన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన ఆదివారం తమిళనాడు రాష్ట్రంలోని పాలయంకొట్టాయిలో చోటు చేసుకుంది.
పాలయంకొట్టాయికి ఐదు కిలోమీటర్ల దూరంలోని తిరుమల్‌నగర్ రెడ్డియర్పాట్టిలోని ఇ కుమారవేలు అనే వ్యక్తి తన నివాసం దగ్గరలోని ఓ షెడ్‌లో చిరుతపులి ఉండటాన్ని గమనించాడు. అయితే ఆ చిరుతపులి షెడ్డులో ఉన్న ఆవు, దాని దూడలపై దాడి చేయలేదు.

చిరుతపులిని చూసిన కుమారవేలు ఇరుగుపొరుగువారిని అప్రమత్తం చేశాడు. దీంతో వారందరూ కలిసి ఆ చిరుత పులిని తరమడం ప్రారంభించారు. అంతమందిని చూసిన చిరుతపులి పరుగెత్తుకుంటూ వెళ్లి ఓ టాయ్‌లెట్ మూలన దాక్కుంది.
కాగా, సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రక్షణ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వారితోపాటు అక్కడికి చేరుకున్న వెటర్నరీ డాక్టర్ ఆ చిరుత పులికి దూరం నుంచి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. దీంతో అది కదలకుండా మత్తులోకి జారుకుంది. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయి.
ఆ చిరుత పులి ఇతర జంతువులపైనా, మనుషులపైనా దాడి చేయకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. చిరుతపులికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కలక్కడ్ ముందంతురై టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో వదలిపెట్టారు. ఆ పులి పాలయంకొట్టాయి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉండవచ్చని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications