దేశ రాజధానిలో లష్కరే ఉగ్రవాది అరెస్ట్, మాజీ సైనికుడిగా తేల్చిన పోలీసులు
న్యూఢిల్లీ: భారత సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత ఉగ్రవాదిగా మారిన ఒక వ్యక్తిని పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో అరెస్టు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఓ ఉగ్ర కుట్రను భగ్నం చేసినప్పుడు అందిన సమాచారం మేరకు ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుడిని లష్కరే తోయిబాకు చెందిన రియాజ్ అహ్మద్‌గా గుర్తించారు.
రియాజ్ అహ్మద్ రిటైర్డ్ ఆర్మీ జవాను అని, గత జనవరి 31న సైన్యం నుంచి పదవీ విరమణ చేశాడని ఢిల్లీ డీసీపీ మల్హోత్రా తెలిపారు. పారిపోయేందుకు ప్రయత్నించిన రియాజ్‌ను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఎగ్జిట్ గేట్ వద్ద అరెస్ట్ చేశామని తెలిపారు. కాగా, జమ్మూకాశ్మీర్‌లో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు రియాజ్, అతడి సహచరులు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.

దాడుల కోసం వారు పాకిస్థాన్‌లో టెర్రరిస్టు గ్రూపుల నుంచి ఆయుధాలు, మందుగుండు తెప్పించేందుకు కుట్ర పన్నారని, వీటితో దాడులు చేయాలన్నది ఈ బృందం లక్ష్యమని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, సిమ్‌కార్డ్‌ను స్వాధీనం చేసుకొన్నారు. కాగా, జమ్ముకశ్మీర్‌లోని కుప్వాడా జిల్లాలో దాడుల కుట్రను ఇటీవలే భద్రతా దళాలు భగ్నం చేశాయి.
పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) నుంచి ఆయుధాల స్మగ్లింగ్‌కు ప్రయత్నిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో అహ్మద్ భట్ అనే వ్యక్తి వద్ద 5 ఏకే సిరీస్ రైఫిళ్లు, తూటాలు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నారు. అతడికి సరిహద్దు అవతలవైపు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయి. పీఓకేలోని లష్కరే నాయకులు మంజూర్ అహ్మద్ షేక్, ఖాజీ మహమ్మద్ ఖుషాల్‌ల ఆదేశాల మేరకు ఈ బృందం పనిచేస్తున్నట్లు తేలింది. రియాజ్‌తోపాటు ఖుర్షీద్ అహ్మద్, గులాం సర్వార్ అనే వ్యక్తులు కూడా పాక్‌లోని ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications