అవి పచ్చి అబద్ధాలు: వాషింగ్టన్ పోస్టు కథనాన్ని తీవ్రంగా ఖండించిన LIC
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ వాషింగ్టన్ పోస్టు చేసిన ఆరోపణలను ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన LIC తీవ్రంగా ఖండించింది. LIC లో పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలపై కొన్ని బహిరంగ శక్తుల ప్రభావం ఉందని.. అదానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం LIC పై ఒత్తిడి తెచ్చిందన్న వార్తలను తాజాగా LIC తోసిపుచ్చింది. అవి పచ్చి అబద్ధాలని, వాషింగ్టన్ పోస్టు ప్రచురించిన కథనంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ వార్తలు నిజానికి దూరంగా ఉన్నాయని.. ఆధారాలు లేనివని కొట్టిపారేసింది.
" LIC లో పెట్టుబడి నిర్ణయాలపై బయటి శక్తుల ప్రభావం ఉందని వాషింగ్టన్ పోస్టు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం.. నిరాధారమైనవి.. నిజానికి దూరంగా ఉన్నాయి" అని LIC తన ప్రకటనలో పేర్కొంది. వాషింగ్టన్ పోస్టు ఈ ఆరోపణలను అక్టోబర్ 24 శుక్రవారం చేసింది. అయితే అక్టోబర్ 25 న శనివారం LIC క్లారిటీ ఇచ్చింది. అదానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టాలని ఎలాంటి రోడ్ మ్యాప్ డాక్యూమెంట్ లేదా ప్లాన్ లేదని LIC సంస్థ తోసిపుచ్చింది.
అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్టు పత్రిక తన కథనంలో.. LIC లో పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలపై బయటి శక్తుల ప్రభావం ఉంటుంది. అదానీ కంపెనీలో 3.9 బిలియన్ డాలర్లు(రూ. 33 వేల కోట్లు) పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వ అధికారులు LIC పై ఒత్తిడి తెచ్చారు.. అని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. అయితే ఈ కథనాలను LIC తీవ్రంగా ఖండించింది. ఇందుకు సంబంధించిన ఏ రోడ్ మ్యాప్ కానీ డాక్యూమెంట్ లేదా ప్లాన్ కానీ లేదని స్పష్టం చేసింది.
అంతేకాక LIC లో పెట్టుబడులకు సంబంధించిన అన్ని నిర్ణయాలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకుంటారని తెలిపింది. పూర్తిగా పరిశీలించిన అనంతరం ఆమోదం తెలిపిన పాలసీలపై మాత్రమే ఈ నిర్ణయాలు ఉంటాయని LIC క్లారిటీ ఇచ్చింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్సిషల్ సర్వీసెస్ లేదా మరొక సంస్థకు ఈ నిర్ణయాలలో ఎలాంటి పాత్ర ఉండదని స్పష్టం చేసింది.

భారతీయ మార్కెట్ లో తమ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్న కుట్రతోనే వాషింగ్టన్ పోస్టు ఇలాంటి కథనాలను ప్రచురిస్తోందని LIC మండిపడింది. పాలసీలకు లోబడే పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు ఉంటాయని.. LIC తమ నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే నడచుకుంటుందని స్పష్టం చేసింది. వాషింగ్టన్ పోస్టు కథనాన్ని అదానీ గ్రూప్ సైతం తీవ్రంగా ఖండించింది. ఏ ప్రభుత్వ ప్లాన్ లోనూ తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications