జార్ఖండ్ లో చంద్రబాబు ఎపిసోడ్ రిపీట్? బీజేపీ బొక్క బోర్లా వెనుక ?
జార్ఖండ్ అసెంబ్లీకి ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. ఇందులో అధికార ఇండియా కూటమి దూసుకుపోతోంది. విపక్ష ఎన్డీయే ఈసారి కూడా వెనుకబడింది. అయితే గతేడాది వరకూ ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొన్న సీఎం హేమంత్ సోరెన్ ఇప్పుడు తాజా ఫలితాలతో మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఈ రెండు పరిణామాల మధ్య ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తాజా సమాచారం మేరకు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీతో కూడిన ఇండియా కూటమి 50కి పైగా సీట్లను సాధించేలా కనిపిస్తోంది. విపక్ష బీజేపీ 20 నుంచి 30 సీట్ల మధ్యలో గెలిచేలా ఉంది. ఇందులో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం ఒక్కటే 30 సీట్లు గెల్చుకునేలా ఉంది. దీంతో ఇప్పుడు హేమంత్ సోరెన్, ఆయన పార్టీ జేఎఎం సాధిస్తున్న విజయాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.ఇంతలా జేఎంఎం పుంజుకోవడం వెనుక ఏం జరిగిందో ఓసారి చూద్దాం.

ఈ ఏడాది జనవరి 31న జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ను ఈడీ బొగ్గు క్షేత్రాన్ని తనకు తాను కేటాయించుకున్న కేసులో ఢిల్లీలో అరెస్టు చేసి జైలుకు పంపింది. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి బాబాయ్ వరసైన చంపై సోరెన్ కు పగ్గాలు అప్పగించారు. సరిగ్గా ఆరు నెలల తర్వాత జూన్ లో హేమంత్ సోరన్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన తిరిగి సీఎంగా పగ్గాలు స్వీకరించారు. ఈ ఆరు నెలల్లో హేమంత్ భార్య కల్పనా సోరెన్ రాష్ట్రమంతా తిరిగి సానుభూతి పోగేశారు. ఇదే అంతిమంగా జేఎంఎంకు భారీ గెలుపును, బీజేపీకి ఓటమినీ మిగిల్చింది.

గతేడాది ఇదే తరహాలో ఏపీ స్కిల్ స్కాం కేసులో అప్పటి విపక్ష నేత చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టింది. దీంతో చంద్రబాబు, పవన్, బీజేపీ జట్టు కట్టి జగన్ ను గత ఎన్నికల్లో ముంచేశారు. అప్పట్లో చంద్రబాబు అరెస్టు ద్వారా జగన్ ఎంత పెద్ద తప్పిదం చేశారో తెలియడానికి ఎంతోకాలం పట్టలేదు. ఇప్పుడు జార్ఖండ్ లోనూ సోరెన్ అరెస్టు బీజేపీకి అలాంటి షాకే ఇచ్చింది. అంతిమంగా చంద్రబాబు ఎపిసోడ్ జార్ఖండ్ లో రిపీట్ అయినట్లయింది.












Click it and Unblock the Notifications