అద్వానీకి భారతరత్న: రుణం తీర్చుకున్న మోదీ
LK Advani: భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కిషన్ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ చేశారు. అద్వానీకి శుభాకాంక్షలు సైతం తెలియజేశారు.
భారతరత్న అవార్డు కోసం ఎల్‌కే అద్వానీ పేరును ఎంపిక చేయడాన్ని స్వాగతించారు. చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. అద్వానీతో మాట్లాడానని, ఈ పురస్కారాన్ని పొందినందుకు అభినందించినట్లు తెలిపారు. అత్యంత గౌరవనీయుడైన రాజనీతిజ్ఞుల్లో ఆయనా ఒకరని పేర్కొన్నారు.

Recommended Video

దేశ అభివృద్ధికి అద్వానీ చేసిన కృషి చిరస్మరణీయమైనదని మోదీ ప్రశంసించారు. అట్టడుగు స్థాయి నుంచి దేశ ఉప ప్రధానమంత్రిగా ఎదిగారని, దేశానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. తన జీవితం మొత్తాన్నీ దేశం కోసం ధారపోశారని పేర్కొన్నారు మోదీ. కేంద్ర హోం శాఖ మంత్రిగా ప్రజల మన్ననలను పొందారని చెప్పారు.
ఇదివరకు బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు అద్వానీ పేరును ఈ అత్యున్నత పౌర పురస్కారం కోసం ఎంపిక చేసింది. గతంలో బీజేపీకే చెందిన మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయికీ ఈ పురస్కారాన్ని అందజేసింది.
అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం యావత్ దేశాన్నీ జాగృతం చేశారు అద్వానీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశం మొత్తం రథయాత్రను నిర్వహించారు. హిందువులనందరినీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చారు. దేశంలో బీజేపీ క్షేత్రస్థాయిలో అత్యంత బలోపేతం కావడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారాయన.
అత్యుత్తమ పార్లమెంటేరీయన్ అవార్డునూ అందుకున్న వారిలో ఒకరు అద్వానీ. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఘన విజయం సాధించారు. 1991లో తొలిసారిగా ఇక్కడి నుంచి గెలుపొందారాయన. అనంతరం 1998 నుంచి 2014 వరకూ ఓటమి అనేదే లేకుండా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగారు. విశ్రాంతి తీసుకుంటోన్నారు.












Click it and Unblock the Notifications