పునాదులు కదులుతున్నాయ్..! కాంగ్రెస్, బీజేపీలకు ప్రాంతీయ పార్టీల 'దడ'
దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. జాతీయ పార్టీల ప్రభ నెమ్మదిగా కనుమరుగవుతోంది. ఇప్పటికే తన ఉనికిని కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ కి తోడు భవిష్యత్తులో బీజేపికి కూడా గడ్డుకాలమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల గాలి బలంగా వీస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యమ్నాయంగా భవిష్యత్తులో థర్డ్ ఫ్రంట్ తెరపైకి రావచ్చుననే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి.
జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ రెండింటి ఓటు బ్యాంకు కలిపినా.. ప్రాంతీయ పార్టీలకు సమానంగా తూగలేని పరిస్థితి. ఓవైపు తాజాగా ఎన్నికలు జరిగిన కేరళ, అసోం రాష్ట్రాల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం కాగా.. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కంటే వెనుకబడిపోయింది బీజేపి.
ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ 115 స్థానాలు దక్కించుకోగా, బీజేపీకి కేవలం 65 స్థానాలు మాత్రమే దక్కాయి. దీన్నిబట్టి ప్రాంతీయ పార్టీల హవా బీజేపీకి కూడా బ్రేక్స్ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇకపోతే.. గత 2012 నుంచి తాజా ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు మొత్తం 30 సార్లు దేశంలో ఎన్నికలు జరిగాయి. ఇందులో 4,117 స్థానాల కోసం ఆయా రాజకీయ పార్టీలు పోటీ పడ్డాయి.

పోటీలో భాగంగా.. బీజేపీ 1,051 స్థానాలను కైవసం చేసుకుంటే, కాంగ్రెస్ 871 స్థానాలను కైవసం చేసుకుంది. రెండు పార్టీలు కలిపి మొత్తం 1,922 సీట్లను దక్కించుకున్నాయి. మిగిలిన 2,195 సీట్లను ఇతర పార్టీలు గెలుచుకోగా ఇందులో సింహ భాగం ప్రాంతీయ పార్టీల ఖాతాలో పడ్డవే. బీఎస్పీ, వామపక్షాలు లాంటి జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ వాటి ప్రభావం ఒకటి, రెండు రాష్ట్రాలకు పరిమితమైంది.
దీన్నిబట్టి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఏకమైనా ప్రాంతీయ పార్టీలను నిలువరించడం అసాధ్యమన్నది సుస్పష్టమవుతోంది. ఇక 2012 నుంచి జాతీయ పార్టీలైన కాంగ్రెస్ ఖాతాలో 11.6 కోట్లు, బీజేపీ ఖాతాలో 12.6 కోట్ల ఓట్లు పోల్ అయ్యాయి. మిగతా పార్టీలకు 33.5 కోట్ల పోల్ అయ్యాయి.
అంటే దేశంలో అతిపెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి 42 శాతం ఓట్లు దక్కితే, మిగతా పార్టీలకు 58 శాతం ఓట్లు దక్కాయి. ఇందులో కాంగ్రెస్ తో జతకట్టిన సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్, తృణమూల్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, ఏఐఏడీఎంకే పార్టీలు కూడా ఉన్నాయి. అంటే జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీలకే జనంలో ఓటు బ్యాంకు ఎక్కువుందనేది దీనితో తేట తెల్లమవుతోంది.
తాజా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోను కాంగ్రెస్ 115, బీజేపీ 64 సీట్లు గెలుపొందగా, ఇతర పార్టీలకు 643 సీట్లు, ఈ రెండు పార్టీలతో జతగూడని పార్టీలకు 465 సీట్లు దక్కడం గమనార్హం.












Click it and Unblock the Notifications