అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
Lok Sabha election 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికల ఘట్టానికి తెర లేచింది. మొత్తం ఏడు దశల్లో ముగిసే ఎన్నికలు ఇవి. తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలయింది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. దక్షిణాదిన తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలకూ నేడే పోలింగ్.
దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశల పోలింగ్ ముగుస్తుంది. అదే నెల 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లల్లో అసెంబ్లీకీ ఎన్నికలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లోని ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకొంటారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ఓటర్లు ఎవరికి పట్టాభిషిక్తులను చేస్తారనేది 4వ తేదీన తేలిపోతుంది.

లోక్‌సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ షెడ్యూల్ అయింది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు.
తొలి విడత పోలింగ్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడారు. ఏఎన్‌ఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి రెండు సంవత్సరాల కిందటే సన్నాహాలు మొదలు పెట్టామని అన్నారు. ఓటరు జాబితాను సిద్ధం చేయడం మొదలుకుని బలగాల మోహరింపు వరకు అన్నింటిపైనా పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించామని తెలిపారు.
సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో సైతం క్షేత్రస్థాయిలో పర్యటించామని వివరించారు. తొలి విడత పోలింగ్ కోసం సుమారు 1.86 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. తొలి విడతలో 16.86 కోట్ల మంది ఓటర్లు ఉన్న తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని రాజీవ్ కుమార్ అన్నారు.

యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ పేరును నమోదు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. ఎన్నికల పట్ల యువతలో ఎలాంటి ఉదాసీనత కనిపించట్లేదని వ్యాఖ్యానించారు. ఈ సారి యువ ఓటర్లు ఎన్నికల ప్రక్రియకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారబోతోన్నారని పేర్కొన్నారాయన.
పోలింగ్ కేంద్రాలకు తమతో పాటు వీలైనంత ఎక్కువ మంది స్నేహితులు, కుటుంబ సభ్యులను పోలింగ్ స్టేషన్‌కు రప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ సంఖ్యలో భద్రత చర్యలను తీసుకున్నామని రాజీవ్ కుమార్ చెప్పారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అన్నారు.












Click it and Unblock the Notifications