పోలవరం, మహిళా ఎంపీలతో అసభ్యంగా.. వాయిదా
న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు లోకసభలో ఆందోళన చేశారు. అలాగే విపక్షాలు కూడా ధరల పెరుగుదల తదితర అంశాల పైన నిరసన తెలిపాయి. దీంతో లోకసభను సభాపతి పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు. తెలంగాణ రాష్ట్ర ఎంపీలు పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరోవైపు, తమ పార్టీ మహిళా ఎంపీ పట్ల బీజేపీ సభ్యులు అసభ్యంగా ప్రవర్తించారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర ఆందోళన చేశారు. సభ ప్రారంభంకాగానే స్పీకర్ వెల్‌లోకి వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
ఆందోళనల మధ్యే సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఇరవై నిమిషాల పాటు సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ వారించినా ఎంతకి తృణమూల్ సభ్యులు వినలేదు. దాంతో, సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అటు రాజ్యసభ అంతకుముందే పదిహేను నిమిషాల పాటు వాయిదా పడింది.
పన్నెండు గంటలకు లోకసభ తిరిగి ప్రారంభమైంది. టీఎంసీ ఎంపీలు తమ నిరసనను తెలియజేశారు. దీంతో సభాపతి స్పందించారు. సభ్యులు అందరూ ప్రవర్తనా నియమావళి పాటించాలని సూచించారు. ప్రవర్తన, పనితీరుతో ప్రజల మన్ననలు పొందాలని హితవు పలికారు. ఆనంతరం అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వేను లోకసభలో ప్రవేశ పెట్టారు.












Click it and Unblock the Notifications