బిజెపిపై కాంగ్రెస్ ప్లాన్: కిరణ్ వ్యూహమేంటి, జగన్ ఢీ

హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో ఆయా పార్టీల్లో రోజుకో మలుపు తిరుగుతోంది. విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీల మధ్య, పార్టీల్లోని నేతల మధ్య పోటా పోటీ కనిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక సొంత పార్టీ కేంద్రమంత్రులు, ఎంపీలు అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ ముసాయిదా బిల్లు)పై అధిష్టానం మొండిగా వ్యవహరిస్తోందని నిప్పులు చెరుగుతున్నారు.

Telangana

బిజెపి మెలిక పెడుతోందా?

విభజన విషయంలో తెలంగాణకు అనుకూలమని చెప్పిన బిజెపి ఇప్పుడు మెలిక పెడుతోందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. కాంగ్రెసు పార్టీ కూడా అవే ఆరోపణలు చేస్తోంది. తాము బిల్లును నెగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నామని, బిజెపి మాత్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కాంగ్రెసు పెద్దలు అంటున్నారు. దీనిపై బిజెపి ఎదురు దాడికి దిగుతోంది. కాంగ్రెసు పార్టీలోనే స్పష్టత లేదని, సొంత ఇంటిని చక్కదిద్దుకోలేక తమ పార్టీ పైన విరుచుకు పడుతోందని బిజెపి విమర్శిస్తోంది.

బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, మరో సీనియర్ నేత వెంకయ్య నాయుడు వంటి తెలంగాణ బిల్లు విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాము తెలంగాణకు మౌళికంగా కట్టుబడి ఉన్నామని అయితే సీమాంధ్ర ప్రాంత సమస్యలు గాలికొదిలేయలేమన్నారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలని చెప్పారు. వెంకయ్య కూడా సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

అద్వానీ, వెంకయ్య వ్యాఖ్యల పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు విమర్శలు చేస్తుండగా, తెలంగాణవాదులకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వారి మాటల్లో షరతులతో కూడిన మద్దతుకు అంగీకరించేవిధంగా ఉందంటున్నారు. అయితే, సాయంత్రం బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఇరు ప్రాంతాల పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి పార్టీ వైఖరిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నాలు చేశారు. తమ పార్టీ మెలిక పెట్టడం లేదని అభిప్రాయపడ్డారు.

తమ పార్టీ మొదటి నుండి తెలంగాణకు కట్టుబడి ఉందని, తాము తప్పకుండా మద్దతిస్తామని చెప్పారు. సీమాంధ్ర ఆందోళనలు తొలగించాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. కాంగ్రెసు పార్టీ ఆ దిశలో చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి సహా సొంత పార్టీ నేతలే అధిష్టానం తీరును తప్పు పటుతున్నప్పుడు తమ పార్టీని కాంగ్రెసు నేతలు ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు.

కాంగ్రెసు పార్టీ పైన సోనియాకు పట్టులేదా అని ప్రశ్నించారు. బిల్లుపై బిజెపి మెలిక పెడుతుండటంతో ఇప్పుడు సమైక్యవాదులు ఆ పార్టీ పైనే ఆశలు పెట్టుకున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుంటే బిజెపి పైన తప్పును మోపాలని కాంగ్రెసు పార్టీ పావులు కదుపుతోంది. అయితే బిజెపి మాత్రం సీమాంధ్రకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూనే ఆఖరుకు బిల్లుకు మాత్రం మద్దతిచ్చేందుకు మానసికంగా సిద్ధమైంది. రెండు ప్రాంతాల్లో బలం పెంజుకునే వ్యూహం బిజెపిలో కనిపిస్తోంది.

ఢిల్లీలో పోటా పోటీ ధర్నాలు

సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర నేతలు, తెలంగాణకు మద్దతు కూడగట్టేందుకు తెలంగాణ నేతలు ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. సమైక్యాంధ్ర విషయమై ఢిల్లీలో ఓ వైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జంతర్ మంతర్ వద్ద, ఎపిఎన్జీవోలు రాంలీలా మైదాన్‌లో ధర్నాకు దిగారు. ఢిల్లీలో ధర్నా ద్వారా జగన్ కాంగ్రెసు పెద్దలను ఢీకొట్టారు. ధర్నాలో కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగిన జగన్ పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించి వేడి రాజేశారు.

కిరణ్‌కు కౌంటర్‌గా బొత్స...

బిల్లుపై రేపు చర్చ ప్రారంభమైతే కిరణ్ రాజీనామా చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఇప్పటికే సీమాంధ్రలో అంతంతగా ఉన్న పార్టీ కిరణ్ రాజీనామాతో మరో కుదుపు రానుంది. కొంతలో కొంత నష్టాన్ని పూడ్చే భాగంలో బొత్స రేపు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, జాతీయ పార్టీ నాయకులను కలవాలని నిర్ణయించుకున్నారు. తమతో కలిసి రావాలని చంద్రబాబు, జగన్, కిరణ్, రాఘవులుకు లేఖలు రాసినట్లు చెప్పారు.

తద్వారా తాము సమైక్యాంధ్ర కోసం ప్రయత్నాలు చేశామని చెప్పుకునేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే, కిరణ్ ఎప్పటి నుండి సమైక్య గళం వినిపిస్తున్నారు. బొత్స సమైక్యవాదులమని చెబుతూనే అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందనేది ప్రశ్నార్థకమే.

కిరణ్ వ్యూహమేంటి?

అసెంబ్లీకి బిల్లు వచ్చిన రోజు..., రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలిపిన రోజు... లోకసభలో బిల్లును ప్రవేశ పెట్టిన రోజు... ఇలా పలు సందర్భాల్లో కిరణ్ రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆఖరుకు లోకసభలో చర్చ జరగబోయే సమయంలో కిరణ్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు! చర్చ సమయంలో రాజీనామా చేయాలని కిరణ్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇప్పటికే బిల్లులో లోపాలున్నాయని బిజెపి రాద్దాంతం చేస్తోంది.

తమ సవరణలకు ఆమోదం తెలపాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. బిల్లు లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో గందరగోళం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లుపై చర్చ ప్రారంభమైతే మరింత గందరగోళం చెలరేగే అవకాశాలున్నాయి. అప్పుడు రాజీనామా చేస్తే దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని కిరణ్ భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఎపి రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

విభజన బిల్లుపై చర్చ సమయంలో సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మరింత సంచలనమవుతుంది. అది తమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని కాంగ్రెసు పార్టీ భావించి కొంత తగ్గే అవకాశాలు లేకపోలేదని కిరణ్ వర్గం భావిస్తోందని అంటున్నారు. తెలంగాణ విషయంలో వెనక్కి వెళ్లకపోయినా సవరణల విషయంలో కొంత పట్టు సడలించవచ్చునని కిరణ్ వర్గం భావిస్తోందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+