దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గ్యారంటీలు: లోక్‌సభ మేనిఫెస్టో హైలైట్స్ ఇవే?
Siddaramaiah: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. ఇంకో 10 రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు సమాయాత్తమౌతోన్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా కూటమి.. ఈ ఎన్నికల ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే.. విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ-ఎన్డీఏ సంకీర్ణ కూటమిని ఓడించడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ ఉపయోగించుకుంటోంది. దీనికి అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టోకు రూపకల్పన చేసింది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. వంటి గ్యారంటీలు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేశాయి. మొదట ఈ గ్యారంటీలను ప్రకటించింది కర్ణాటకలో. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఈ ఫార్ములా తెలంగాణలో సక్సెస్ అయింది. పార్టీకి అధికారాన్ని అప్పగించింది.
ఇప్పుడు అదే సూత్రాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఉద్దేశంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. దీనితో పాటు పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులకు అధిక ఆదాయాన్ని కల్పించేలా పథకాలను అమలు చేసే హామీలపైనా దృష్టి పెట్టింది. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు అధికారాన్ని అప్పగించడానికి ప్రధాన కారణమైన వాటిపై కసరత్తు పూర్తి చేసింది.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ, యువత, మహిళలు, పేదలు, రైతులకు ఉద్దేశించిన పథకాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉపాధి కల్పనను చట్టబద్ధం చేసే బ్రహ్మాస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. జనాకర్షకంగా మేనిఫెస్టోను రూపొందించడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని సైతం ఇదివరకే ఏర్పాటు చేసింది కాంగ్రెస్.
ఈ కమిటీ- తాజాగా తన డ్రాఫ్ట్ మేనిఫెస్టోను ఏఐసీీసీ అధినేత మల్లికార్జున ఖర్గేకు అందజేసింది. మొత్తం 16 మందితో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. పీ చిదంబరం దీనికి ఛైర్మన్. కన్వీనర్‌గా ఛత్తీస్‌గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ వ్యవహరించారు.

ఈ కమిటీలో- కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆనంద్ శర్మ, జైరామ్ రమేష్, శశిథరూర్, గైఖంగమ్, గౌరవ్ గొగొయ్, ప్రవీణ్ చక్రవర్తి, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కే రాజు, ఓంకార్ సింగ్ మర్కమ్, రంజీత్ రంజన్, జిగ్నేష్ మేవాణి, గుర్దీప్ సప్పల్ ఉన్నారు.
ఈ మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చోటు కల్పించడం వెనుక ఉన్న లక్ష్యం ఇదే. సిద్ధరామయ్య మొదలు పెట్టిన ఈ గ్యారంటీ ఫార్ములాను లోక్‌సభ ఎన్నికల్లోనూ ఉపయోగించే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications