వెల్‌లోకి విపక్షాలు: నల్లధనంపై దద్ధరిల్లిన లోకసభ
న్యూఢిల్లీ: నల్లధనం వ్యవహారంపై మంగళవారం లోకసభ దద్ధరిల్లింది. పార్లమెంటు సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి నల్లధనంపై చర్చకు అనుమతించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. నల్లధనంపై చర్చకు సమయం కేటాయిస్తామని స్పీకర్ సుమిత్రా మహాజన్ నచ్చజెప్పడానికి ప్రయత్నించినా సభ్యులు వినలేదు.
తృణమూల్ కాంగ్రెసు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఒక దశలో స్పీకర్ వారిపై అసహనం వ్యక్తం చేశారు. గందరగోళం మధ్యనే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. అయితే, సభ్యులు ఎంతకీ వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. నల్లధనాన్ని వెనక్కి తెప్పించాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెసు సభ్యులు నినాదాలు చేశారు.

రాజ్యసభలో కూడా అదే అంశంపై చర్చించాలని తృణమూల్ కాంగ్రెసు సభ్యులు ఆందోళనకు దిగారు. పార్లమెంటు ప్రధాన గేటు వద్ద వారు ఆందోళనకు దిగారు. రాజ్యసభలో నల్లధనంపై చర్చను కోరుతూ తృణమూల్ కాంగ్రెసు సభ్యులు నోటీసు ఇచ్చారు.
నల్లధనాన్ని వెనక్కి తెప్పించడంపై, సిబిఐ చీఫ్ నియామకంపై బిల్లుకు సవరణలు, బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల అంశాలు లోకసభను తాకాయి. వంద రోజుల్లో నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పటికి 200 రోజులు గడిచాయని, ఏ విధమైన చర్యలు కూడా తీసుకోలేదని టిఎంసి నాయకుడు సుఖేందు ఖార్గే అన్నారు.
లోకసభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభ సద్దుమణగలేదు. నల్లధనంపై తక్షణ చర్చకు ప్రతిపక్షాల సభ్యులు పట్టుబట్టారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రతిస్పదిస్తూ - నల్లధనంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభ సజావుగా జరిగేందుకు సభ్యులు సహకరించాలని అన్నారు. యుపిఎ ప్రభుత్వం నల్లధనం విషయంలో ఏమీ చేయలేకపోయిందని, తాము ఆరు నెలల్లోనే అందుకు తగిన చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్యనే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను కొనసాగించారు.












Click it and Unblock the Notifications