పార్లమెంట్ అప్ డేట్- చర్చ లేకుండానే మూడు కీలక బిల్లులు ఆమోదించిన లోక్ సభ
విపక్షాల ఆందోళనల మధ్య సాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ఇవాళ మూడు కీలక బిల్లుల్ని ఎలాంటి చర్చ లేకుండానే లోక్ సభలో ఆమోదించింది. ఇందులో రెండు ఆర్ధిక బిల్లులతో పాటు ఓ వైద్య బిల్లు కూడా ఉంది. విపక్షాల నిరసనల మధ్యే ఈ బిల్లులు ఆమోదించడం మరో విశేషం.
భారతీయ ఔషధ వ్యవస్దపై జాతీయ కమిషన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన సవరణ బిల్లును కేంద్రమంత్రి శర్బానంద్ సోనోవాల్ లోక్ సభలో ప్రవేశపెట్టగా స్పీకర్ దాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. పెగాసస్ పై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడాన్ని విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తప్పుబట్టారు. అయితే కేంద్రం అన్ని అంశాల్ని చర్చించేందుకు సిద్ధంగా ఉందని మరో మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ తెలిపారు.

ఆ తర్వాత ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పరిమిత బాధ్యత కలిగిన భాగస్వామ్య సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీన్ని కూడా లోక్ సభ చర్చ లేకుండానే ఆమోదించింది. పెద్ద, చిన్న వ్యాపార భాగస్వాముల మధ్య వివాదాలు తగ్గించేందుకు తీసుకొచ్చిన ఈ కీలకబిల్లు చర్చకు నోచు కోకపోవడంపైనా విపక్షాలు పెదవి విరిచాయి. విపక్షాల నిరసనల మధ్యే నిర్మలా సీతారామన్ మరో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. డిపాజిట్ ఇన్సూరెన్స్, మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ సవరణ బిల్లును నిర్మల ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభలోనూ ఆమోదం పొందింది.












Click it and Unblock the Notifications