Delhi Bill: ఢిల్లీ బిల్లుకు లోక్ సభ ఆమోదం-విపక్షాల తీవ్ర నిరసనలు, వాకౌట్...
ఢిల్లీలో అధికారులపై ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి పెత్తనం ఉండేలా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ కేంద్రం రూపొందించిన సవరణ బిల్లు ఇవాళ లోక్ సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. కేంద్రం తీరుపై విరుచుకుపడ్డాయి. చివరికి లోక్ సభ నుంచి వాకౌట్ కూడా చేశాయి. దీంతో ప్రభుత్వం సునాయాసంగా బిల్లు నెగ్గించుకుంది.
ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు ఇవాళ విపక్షాల వాకౌట్ మధ్య లోక్‌సభలో ఆమోదం పొందింది. లోక్‌సభ బిల్లును ఆమోదించిన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు సభ నుండి వాకౌట్ చేశారు. దేశ రాజధానిలో బ్యూరోక్రాట్‌లను ఎవరు నియంత్రిస్తారనే దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును హోంమంత్రి అమిత్ షా సమర్థించారు.

కేంద్రం అంతకు ముందు సుప్రీంకోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ను లోక్ సభలో సమర్ధించుకుంది. ఈ ఆర్డినెన్స్ జాతీయ రాజధాని ఢిల్లీకి సంబంధించిన ఏదైనా అంశంపై చట్టాలను రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉందనే సుప్రీం కోర్టు ఆదేశాన్ని సూచిస్తుందని చెప్పుకుంది. ఢిల్లీ కోసం చట్టాలు చేయడానికి కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయని ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023ని ప్రస్తావిస్తూ అమిత్ షా వెల్లడించారు.
బిల్లు ఆమోదానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ బిల్లు కేవలం ఢిల్లీ ప్రజలను బానిసలను చేయడానికి మాత్రమే ఉద్దేశించబడిందంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజల హక్కులను హరించే బిల్లుపై అమిత్ షా ఈరోజు లోక్‌సభలో మాట్లాడడం విన్నానని, బిల్లుకు మద్దతు ఇవ్వడానికి వారి దగ్గర ఒక్క సరైన వాదన కూడా లేదన్నారు. వారు తప్పు చేస్తున్నారని వారికి కూడా తెలుసని కేజ్రివాల్ తెలిపారు. ఈ బిల్లు ఢిల్లీ ప్రజలను బానిసలుగా మార్చే బిల్లు అన్నారు. ఇది వారిని నిస్సహాయులుగా చేసే బిల్లు అన్నారు. దీన్ని భారతదేశం ఎప్పటికీ అనుమతించదన్నారు.












Click it and Unblock the Notifications