శ్రీకృష్ణుడు మిమల్ని శపిస్తాడు: అఖిలేస్ యాదవ్‌కు చురకలంటించిన యోగి ఆదిత్యనాథ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పుడు యూపీలో రాజకీయాలు రాముడు, శ్రీకృష్ణుడు చుట్టూ తిరుగుతున్నాయి. శ్రీకృష్ణుడు తన కలలోకి రోజూ వస్తున్నాడని, రామరాజ్యాన్ని నెలకొల్పడానికి త్వరలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు.
ఇటీవల బీజేపీ రాజ్యసభసభ్యుడు హర్‌నాథ్ సింగ్ యాదవ్ పార్టీ అధిష్టానానికి ఓ లేఖ రాశారు. 'యోగి ఆదిత్యనాథ్ ఈసారి మథుర నుంచి పోటీ చేయాలని రాత్రి నా కలలో ఎవరో చెప్పారు. బహుశా ఆ కృష్ణ పరమాత్ముడే ఈ విషయంలో నన్ను మధ్యవర్తిత్వం చేయమని ఆదేశించి ఉంటాడు' హర్ నాథ్ పేర్కొన్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు.

గత రాత్రి నాకు కలలో కృష్ణుడు కనిపించి.. రామరాజ్యం నెలకొల్పడానికి త్వరలోనే నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పాడు. నిన్న ఒక్కరోజే కాదు. ప్రతి రోజూ శ్రీకృష్ణుడు నా కలలోకి వస్తాడు అని అఖిలేష్ యాదవ్ బీజేపీ నేత వ్యాఖ్యలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్.. అఖిలేష్ యాదవ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
'కొంతమందికి కృష్ణ భగవానుడు తప్పకుండా కలలో కనిపిస్తాడు. వారి వైఫల్యాలకు ఇప్పుడైనా దు:ఖించమని చెప్పి ఉంటాడు. మీ(అఖిలేష్ యాదవ్) చేయలేనిది బీజేపీ ప్రభుత్వం చేసి చూపిస్తోంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మథుర, బృందావనం అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నిస్తూ శ్రీకృష్ణ భగవానుడు మిమ్మల్ని(అఖిలేష్) శపిస్తున్నాడు' అని యోగి ఆదిత్యనాథ్ చురకలంటించారు.
కాగా, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ పోటీ చేసే అవకాశం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మథుర లేదా అయోధ్య నుంచి పోటీ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను ఎక్కడ్నుంచైనా పోటీ చేస్తానని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications