బంగాళాఖాతంలో ఆవర్తనం- ఏకధాటి వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం రెండు రాష్ట్రాలపై తీవ్రంగా పడింది. కర్ణాటక, తమిళనాడుల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతోన్నాయి. రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు తడిచి ముద్ద అవుతున్నాయి.
నైరుతి బంగాళాఖాతం- శ్రీలంక తూర్పు తీరం మీదుగా తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సుమారు 2.5 కిలోమీటర్ల ఎత్తున విస్తరించి ఉన్న ఈ ఆవర్తనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనావేసింది. మరింత విస్తరించడానికీ అనుకూల వాతావరణం ఉందని పేర్కొంది. ఫలితంగా బెంగళూరు సహా కర్ణాటకలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

బెంగళూరులో అర్ధరాత్రి ఆరంభమైన వర్షం ఏకధాటిగా ఉదయం 9 గంటల వరకూ దంచి కొట్టింది. ఎంజీ రోడ్, ఇందిరానగర్, ఎలక్ట్రానిక్ సిటీ, జయనగర, హెబ్బాళ, సుల్తాన్ పాళ్య, ఆర్టీ నగర, సహకార నగర, విద్యారణ్యపుర, యలహంక, జాలహళ్లి, సంజయ్ నగర్, భద్రప్ప లేఅవుట్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్.. వంటి ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
దక్షిణ బెంగళూరు (రామనగర), చిక్‌బళ్లాపురా, కోలార్, చామరాజనగర, మైసూర్, దక్షిణ కన్నడ.. వంటి జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు, మరి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ ఏడాది తొలి వర్షపాతం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అటు తమిళనాడులోనూ ఈ ఆవర్తన ప్రభావం కనిపించింది. చెన్నై సహా పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. పుదుచ్చేరి, కరైకల్ సహా తమిళనాడు ఉత్తర ప్రాంత జల్లాలు తంజావూరు, తిరువారూరు, నాగపట్నం, మైలాడుథురై, పుదుక్కోట్టై, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యకుమారి జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.
దక్షిణ తమిళనాడు తీర ప్రాంతంలో గంటకు 35 నుండి 45 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గాలుల తీవ్రత గంటకు 55 కిలో మీటర్లకు పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే రెండు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది.












Click it and Unblock the Notifications