LPG gas cylinder price hike: సామాన్యుడిపై మరో భారం... రూ.25 పెరిగిన వంట గ్యాస్ ధర
అసలే కరోనా కాలం... ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు మరోవైపు పెట్రో ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు సామాన్యుడిపై ఇప్పుడు మరో భారం పడింది. జులై 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్ గ్యాస్ ధరను రూ.25.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో గడిచిన ఆర్నెళ్లలోనే సిలిండర్ ధర రూ.140 మేర పెరిగినట్లయింది.
సవరించిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో గృహావసరాలకు వినియోగించే 14.2కేజీల సిలిండర్ ధర రూ.834.50కి చేరింది. గతంలో ఇదే సిలిండర్ రూ.809లకు లభించింది. ఇక 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.76 మేర పెరిగి రూ.1550కి చేరింది. చెన్నైలో 14.2కేజీల సిలిండర్ ధర రూ.850.5కి చేరగా,కోల్‌కతాలో రూ.835.5కి చేరింది.

పెరిగిన సిలిండర్ ధరలు సబ్సిడీ వినియోగదారులతో పాటు సబ్సిడియేతర వినియోగదారులకు వర్తిస్తాయి. ప్రస్తుతం ప్రతీ ఏటా ఒక ఇంటికి 14.2 కేజీల సిలిండర్లను 12 చొప్పున కేంద్రం సబ్సిడీపై అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ 12కి మించి సిలిండర్లు వినియోగిస్తే మార్కెట్ ధరను చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ప్రతీ నెలా ఎల్‌పీజీ ధరలను చమురు సంస్థలు సవరిస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు,డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా దేశీయంగా ఎల్‌పీజీ ధరలను ప్రతీ నెలా సవరిస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ నాటికి రూ.644గా ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1వెయ్యికి చేరువవుతండటం గమనార్హం. ఇప్పటికే లీటరు పెట్రోల్ ధర రూ.100కి చేరడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే వంట నూనెల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. గడిచిన కొద్ది నెలల్లో వంట నూనెల ధరలు రెట్టింపయ్యాయి.
అసలే కరోనా కాలంలో ఉద్యోగాలు,ఉపాధి కోల్పోయి సామాన్య,మధ్యతరగతి జీవులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో... ఇలా ధరల మీద ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా ఇప్పటికే విపక్షాలు పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.












Click it and Unblock the Notifications