బండ బాదుడు.. షాక్ కొట్టేలా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు నేటి నుండి అమలు!!
గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు భారీగా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. గృహాలలో వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ పై ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ, వాణిజ్య వినియోగంలో ఉపయోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర మాత్రం భారీగా పెరిగింది. అయితే వాణిజ్య వినియోగానికి ఉపయోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 250కి పైగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా హైదరాబాద్ లో వ్యాపార కార్యకలాపాలకు సిలిండర్ ధర 2186 రూపాయల నుండి 2460 రూపాయలకు అమాంతం పెరిగింది. దీంతో హోటళ్లలో తినుబండారాలు, ఆహారపదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

బాగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరలు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కాగా, ఈరోజు ఇంధన ధరలను యథాతథంగా ఉంచారు. ఇక ఇంధనం విషయంలో మార్చి 22 నుండి తొమ్మిది సార్లు చేసిన రేట్ల సవరణలలో, ధరలు లీటరుకు రూ. 6.40 పెరిగాయి. కమర్షియల్ సిలిండర్ల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ధరలు 250 రూపాయలకు పైగా పెరగడంతో వర్తక, వ్యాపారాలకు వాణిజ్య సిలిండర్లను ఉపయోగించేవారు లబోదిబోమంటున్నారు.అయితే, దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలను యథాతథంగా ఉంచారు. ఇప్పుడు ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 949.50 గా ఉంది. డొమెస్టిక్ సిలిండర్ ధర ప్రస్తుతం హైదరాబాద్ లో 1002 రూపాయల వద్ద ఉంది.

దాదాపు 250 రూపాయలు పెరిగిన వాణిజ్య సిలెండర్
దేశ రాజధానిలో, 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధర 2,253 రూపాయలు అని తెలుస్తుంది. ముంబైలో, 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,205 గా ఉంది. కోల్‌కతాలో, వాణిజ్య ఎల్పిజి సిలిండర్ రేటు 2,351 రూపాయలుగా ఉంది. చెన్నైలో ఇప్పుడు 19 కిలోల సిలిండర్ ధర 2,406 రూపాయలుగా ఉంది. కొత్త రేటు నేటి నుండి అమలులోకి వస్తుంది. ఎల్‌పిజి ధరలు గత నెలలో బెంచ్‌మార్క్ ఇంధన ధర ఆధారంగా ప్రతి నెలా 1వ తేదీన సవరించబడతాయి. దాదాపు 250 రూపాయలు పెరిగిన వాణిజ్య సిలెండర్ ధరలతో వ్యాపార వర్గాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. వాణిజ్య సిలిండర్‌ల ధరలు గత నెలలో ఒక్కో సిలిండర్ ధరతో 105 రూపాయలు పెంచిన తర్వాత ఇది మూడవ అత్యధిక పెంపుగా కనిపిస్తుంది.

విమానయాన టర్బైన్ ఇంధనం ధరలకు రెక్కలు
అయితే, ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం విమానయాన టర్బైన్ ఇంధనం (ATF) ధరలు కిలోలీటర్‌కు (kl) రూ. 2,258.54 లేదా 2 శాతం పెరిగి దేశ రాజధానిలో రూ. 1,12,924.83కి చేరాయి. అంతర్జాతీయ సగటు ధర ఆధారంగా ప్రతి నెలా 1వ మరియు 16వ తేదీల్లో జెట్ ఇంధన ధరలు సవరించబడతాయి. 2022 ప్రారంభం నుండి ప్రతి పదిహేను రోజులకు విమానయాన టర్బైన్ ఇంధనం ధరలు పెరుగుతూ వచ్చాయి. జనవరి 1 నుండి ప్రారంభమయ్యే ఏడు పెంపులలో, విమానయాన టర్బైన్ ఇంధనం ధరలు రూ. 38,902.92 kl, దాదాపు 50 శాతం పెరిగాయి.












Click it and Unblock the Notifications