గోపాలపురం నివాసానికి కరుణానిధి భౌతికకాయం: నివాళులర్పించిన రజినీకాంత్, మమత
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భౌతికకాయాన్ని కావేరి ఆసుపత్రి నుంచి గోపాలపురంలోని ఆయన నివాసానికి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. భౌతికకాయం తరలిస్తున్న అంబులెన్స్‌తో పాటు వేలాది మంది ఆయన అభిమానులు ప్రదర్శనగా కరుణ నివాసానికి చేరుకున్నారు.
ఇంటి వద్ద కొన్ని క్రతువులు పూర్తయిన తర్వాత బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కరుణ భౌతికకాయాన్ని రాజాజీ హాల్‌కు తరలించనున్నారు. బుధవారం సాయంత్రం కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనన్నట్లు డీఎంకే నేతలు వెల్లడించారు.

రజినీకాంత్, మమత నివాళులు
గోపాలపురం నివాసంకు చేరిన కరుణానిధి భౌతికకాయానికి ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుతి తెలియజేశారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు. గోపాలపురం నివాసానికి చేరుకుని కరుణానిధి భౌతికకాయానికి నివాళులర్పించారు.

నేడు ప్రధాని, ముఖ్యమంత్రుల రాక
కరుణానిధి భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం చెన్నైకి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్‌లు కూడా చెన్నైకి వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications