Bittu Tabahi: అంతా నాశనం చేశారు. నదికి మళ్లీ అదే దుస్థితి!
'మేరా భారత్ మహాన్' అని గర్వంగా చెప్పుకునే మనం, మన చుట్టూ ఉన్న ప్రకృతిని, నదులను ఎంతటి దారుణంగా కలుషితం చేస్తున్నామో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. పట్టుమని 25 ఏళ్లు కూడా నిండని ఓ సామాన్య యువకుడు ఒంటిచేత్తో ఒక నదిని పూర్తిగా ప్రక్షాళన చేస్తే, మనం దానిని కనీసం నెల రోజులు కూడా పరిశుభ్రంగా కాపాడుకోలేకపోతున్నామనేది మన సమాజం సిగ్గుపడాల్సిన నిజం.
మధ్యప్రదేశ్లోని అజ్నార్ నదిని ఎనిమిది నెలల పాటు తీవ్రంగా శ్రమించి, టన్నుల కొద్దీ చెత్తను తొలగించిన బిట్టు తాబాహి అనే కుర్రాడికి తాజాగా ఎదురైన చేదు అనుభవం అందరినీ ఆలోచింపజేస్తోంది. తాను ఎంతో కష్టపడి శుభ్రం చేసిన నది మళ్లీ ప్లాస్టిక్ సంచులతో నిండిపోవడంతో ఆ యువకుడు తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు.

మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ప్రవహించే అజ్నార్ నదిని శుభ్రం చేసేందుకు సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ 'బిట్టు తాబాహి' ఏకంగా ఎనిమిది నెలల పాటు శ్రమించాడు. ఎటువంటి ప్రత్యేక పరికరాలు లేకుండా, తన ఒక్కడి చేతులతో టన్నుల కొద్దీ చెత్తను నది నుంచి బయటకు తీశాడు. అయితే, అంత కష్టపడి క్లీన్ చేసిన ఆ నదిలో కొద్ది వారాలకే మళ్లీ ప్లాస్టిక్ సంచులు, చెత్తాచెదారం వచ్చి చేరాయి. నది ఒడ్డున కుప్పలు తెప్పలుగా పడి ఉన్న చెత్తను చూసి షాక్కు గురైన 20 ఏళ్ల బిట్టు తాబాహి తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యాడు. "నేను పడ్డ ఎనిమిది నెలల కష్టమంతా ఇలా వ్యర్థమవుతుందని కలలో కూడా ఊహించలేదు" అంటూ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆవేదన వెల్లబుచ్చాడు.
ఈత రాకపోయినా తగ్గేదేలే.. మళ్లీ రంగంలోకి దిగిన రియల్ హీరో!
చెత్తను చూసి కృంగిపోకుండా, ఆ కుర్రాడు మళ్లీ నదిని శుభ్రం చేసే పనులను ప్రారంభించాడు. తనకు అసలు ఈత రాకపోయినా లెక్కచేయకుండా, మళ్లీ నీటిలోకి దిగి వరుసగా చెత్త సంచులను బయటకు లాగుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. పెద్దఎత్తున పేరుకుపోతున్న వ్యర్థాలను మరింత సమర్థవంతంగా ఎలా తొలగించవచ్చో తనకు తగిన సలహాలు ఇవ్వాలని తన ఫాలోవర్లను కోరాడు.
నదులలో ఎవరైనా నిరంతరం చెత్త వేస్తుంటే, ఒక్క వ్యక్తి మాత్రమే వాటిని ఎలా శుభ్రం చేయగలడనే పెద్ద ప్రశ్నను అతడి పోస్ట్ లేవనెత్తింది. బిట్టు పడుతున్న శ్రమను చూసిన నెటిజన్లు అతనికి అండగా నిలుస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నదులను కాపాడుకోవడం ఒక్కరి బాధ్యతే కాదని, సమాజం మొత్తం మేల్కొనాలని కోరుతున్నారు.
ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు!
బిట్టు తాబాహి కేవలం అజ్నార్ నది మాత్రమే కాకుండా, బెంగళూరులోని కనకపుర రోడ్డు సమీపంలోని తురహళ్లి అడవిని కూడా తన 100 మంది స్నేహితుల బృందంతో కలిసి విజయవంతంగా శుభ్రం చేశాడు. ఆయన చేపట్టిన ఈ పర్యావరణ పరిరక్షణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం బిట్టు నది శుభ్రం చేసే వీడియోను 'ఎక్స్' వేదికగా షేర్ చేసి అభినందించారు. అంతేకాకుండా, నెదర్లాండ్స్కు చెందిన పర్యావరణ సంస్థ 'ది ఓషన్ క్లీనప్' వ్యవస్థాపకుడు బోయాన్ స్లాట్ నుంచి కూడా బిట్టుకు అంతర్జాతీయ గుర్తింపు లవించడంతో పాటు ఉద్యోగ ఆఫర్ కూడా రావడం విశేషం.














Click it and Unblock the Notifications
