తెలంగాణ అభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్.. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త విజన్!
'సమాఖ్య' అనే పదానికి సమాజంలో ఎంతో బలం ఉందని, ప్రాచీన కాలంలో వస్తు మార్పిడి విధానం నుంచి మొదలైన వ్యాపార పద్ధతులు నేటి ఆధునిక యుగంలోనూ సమాఖ్యల ద్వారానే సరికొత్త మార్పులను అందిపుచ్చుకుంటున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నూతన తరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉన్నత లక్ష్యంతో 'సమాఖ్య బిజినెస్ సమ్మిట్-2026'ను నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సమాఖ్య బిజినెస్ సమ్మిట్-2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు.
వ్యాపార, రాజకీయ రంగాల్లో మున్నూర కాపుల పాత్ర
సినిమా, రాజకీయ,వ్యాపార రంగాల్లో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, పారిశ్రామికవేత్తలు వివిధ హోదాల్లో విశేషంగా రాణించారని సీఎం రేవంత్ కొనియాడారు. ఉన్నత శిఖరాలకు ఎదగడమే కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలిచారని, వారి విజయాగాథలను సమాఖ్య నిక్షిప్తం చేసి నవతరానికి స్ఫూర్తిగా అందించాలని ఆయన సూచించారు.

తెలంగాణ విజన్ 2047.. CURE, PURE, RARE మోడల్
2047 నాటికి స్వతంత్ర భారతం 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న 'వికసిత్ భారత్' సాధనకు రాష్ట్రాల సహకారం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. "ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలి.. అభివృద్ధి విషయంలో అందరం కలిసికట్టుగా పనిచేయాలి. అందుకే 2025లోనే 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నాం. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా ప్రభుత్వ సంకల్పం" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునేందుకు రాష్ట్రాన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు.
CURE (Core Urban Region Economy): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపలి ప్రాంతం. ఇక్కడ ఐటీ, సేవా రంగాలు, అత్యాధునిక టెక్నాలజీ, ఆవిష్కరణలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
PURE (Peri Urban Region Economy): ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (RRR) వరకు ఉన్న ప్రాంతం. ఇక్కడ తయారీ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహిస్తాం.
RARE (Rural Agriculture Region Economy): మిగిలిన గ్రామీణ ప్రాంతం. ఇక్కడ వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయాధారిత పరిశ్రమలు, గ్రామీణ ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తాం.
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్‌గా తెలంగాణ
ప్రస్తుతం భారత జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని, దాన్ని 10 శాతానికి పెంచేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. "400 ఏళ్ల క్రితమే దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు చార్మినార్ ఎలాగైతే ల్యాండ్ మార్క్‌గా నిలిచిందో, ఆధునిక యుగంలో వ్యాపారాలకు హైటెక్ సిటీ ఆ స్థాయి ల్యాండ్ మార్క్‌గా మారింది. మన వాళ్లు కేవలం కార్పొరేట్ కంపెనీలకు సేవలు అందించే స్థాయికే పరిమితం కాకుండా, స్వయంగా పెట్టుబడులు పెట్టి గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి" అని పిలుపునిచ్చారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత
ప్రపంచంలో మహిళల భాగస్వామ్యం ఎక్కడ ఎక్కువగా ఉందో ఆ దేశాలే ఆర్థికంగా బలపడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం రూ. 61,000 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను అందించినట్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లలో మహిళలను యజమానులను చేశామని పేర్కొన్నారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా యువతతో పాటు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.














Click it and Unblock the Notifications
