IAS Transfer: 50 రోజుల్లోనే పక్కన పెట్టేశారు! వాట్సాప్ గ్రూప్‌లోనే రచ్చ
అధికార యంత్రాంగంలో నిజాయితీగా పనిచేసే అధికారులకు రక్షణ ఏదీ? తప్పులను ప్రశ్నిస్తే బదిలీల శిక్ష తప్పదా? మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ మహిళా అధికారిణి వైఖరి ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఏడాది కాలంలోనే ఏకంగా నాలుగు సార్లు బదిలీ వేటు పడటం, కొత్త పోస్టింగ్ ఇచ్చిన కేవలం 50 రోజుల్లోనే మళ్లీ పక్కన పెట్టడంతో ఆమె ఏకంగా అధికారిక ఐఏఎస్ అధికారుల వాట్సాప్ గ్రూప్‌లోనే ఐఏఎస్ అసోసియేషన్ తీరును బహిరంగంగా ప్రశ్నించారు. వ్యవస్థలో జరుగుతున్న అన్యాయంపై ఒక బ్యూరోక్రాట్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి నేహా మార్వ్య సెప్టెంబర్ 5న మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల జాబితాలో మళ్లీ తన పేరు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శాఖలోని కొందరు కింది స్థాయి ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతూ, తన ఆదేశాలను ధిక్కరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఫైళ్లను తొక్కిపెడుతూ, తన వద్దకు వచ్చి టేబుల్‌పై చేతులు బాది "నిన్ను ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తాం" అని బహిరంగంగానే బెదిరింపులకు దిగారని ఆమె వాపోయారు. తప్పు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటారని తాను భావిస్తే.. రివర్స్‌లో తననే మళ్లీ మళ్లీ బదిలీ చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు.

అసోసియేషన్ తీరుపై బాహాటంగా విమర్శలు!
ఐఏఎస్ అధికారుల క్షేమం కోసం పనిచేయాల్సిన 'ఐఏఎస్ అసోసియేషన్' నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని నేహా మార్వ్య ఘాటుగా స్పందించారు. "అసోసియేషన్ విధి కేవలం అధికారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మెసేజ్ చేయడం వరకే పరిమితమా?" అని ఐఏఎస్ గ్రూప్‌లో ప్రశ్నించడం సంచలనంగా మారింది. గతంలో ప్రభుత్వం ఏ పోస్టింగ్ ఇచ్చినా గౌరవప్రదంగా స్వీకరించానని, కానీ ఇలా 50 రోజులకే పదే పదే బదిలీలు చేస్తూ వేధించడం వల్ల అధికారుల మనోధైర్యం దెబ్బతింటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త బదిలీలోనూ కీలక శాఖల కోత!
తాజా బదిలీలకు ముందు వరకు నేహా మార్వ్య గిరిజన ప్రాంత అభివృద్ధి పథకాల డైరెక్టర్‌గా, ఎంపీఈపీఎస్ఈటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, గిరిజన పరిశోధన సంస్థ డైరెక్టర్‌తో పాటు పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. అయితే తాజాగా జరిగిన బదిలీల్లో ఆమెకు కేవలం గిరిజన వికాస కార్పొరేషన్ ఎండీ బాధ్యతను మాత్రమే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కింది స్థాయి సిబ్బంది అక్రమాలను ప్రశ్నించినందుకు ఒక బాధ్యతాయుతమైన ఐఏఎస్ ఆఫీసర్కే ఈ పరిస్థితి ఎదురవ్వడంపై సీనియర్ అధికారుల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.














Click it and Unblock the Notifications
