కాంగ్రెస్ కోర్ టీం లోకి జగన్ విధేయ అధికారి- ఎన్నికల బరిలోకి..!!
ఏపీ కేంద్రంగా పని చేసిన మరో ఐఏఎస్ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. జగన్ హయాంలో కీలక అధికారిగా వ్యవహరించారు. అనేక వివాదాలకు కేంద్రంగా నిలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్వచ్చంద పదవీ విరమణ చేసారు. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ కోర్ టీం కు దగ్గరయ్యారు. ఎన్నికల్లో పోటీకి రంగం సిద్దం చేసుకున్నారు. ప్రవీణ్ ప్రకాశ్ బాటలోనే మరో రిటైర్డ్ ప్రముఖ ఐఏఎస్ ఉన్నారని తెలుస్తోంది.
సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ పొలిటికల్ గా కొత్త జీవితం మొదలు పెట్టారు. జగన్ హాయంలో ప్రవీణ్ ప్రకాశ్ కీలకంగా వ్యవహరించారు. సీఎంఓ తో సహా కీలక శాఖల్లోని అధికారులు ప్రవీణ్ ప్రకాశ్ వైఖరి పైన జగన్ కు ఫిర్యాదులు చేసారు. పలు వివాదాస్పద నిర్ణయాల అమలుకు ప్రయత్నించి విమర్శలకు కారణమయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత క్షమాపణ కోరారు. తాజాగా వీఆర్ఎస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాశ్ ఇప్పుడు కాంగ్రెస్ లో మరో పాత్రకు సిద్దమయ్యారు.తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ హయాంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన సమయంలో ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యకం చేసాయి. ఇక, 2024లో ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసారు. ప్రభుత్వం వెంటనే నోటిఫై చేసింది. ప్రవీణ్ ప్రకాశ్ సతీమణి భావన సక్సేనా ఐపీఎస్ అధికారి. మోదీ మానసపుత్రిక పథకమైన స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా గతంలో వారణాసిలో పనిచేసిన అనుభవం ప్రవీణ్ ప్రకాశ్‌కు ఉంది.

అసెంబ్లీ ఎన్నికల బరిలోకి సిద్దం
అదే విధంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం ప్రవీణ్ ప్రకాశ్ కు బ్యాచ్ మెట్. దీంతో.. తొలుత ప్రవీణ్ ప్రకాశ్ బీజేపీలో చేరాలని ప్రయత్నాలు చేసారు. అయితే, మారుతున్న పరిస్థితులు... యూపీ లో చోటు చేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఐఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్ అయిన తాను టెక్నాలజీ లేదా కార్పొరేట్ రంగంలో రాణించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాసేవలో పాలుపంచుకోవాలన్న బలమైన ఆకాంక్షతోనే ఉన్నత సర్వీసును ఎంచుకున్నానని ప్రవీణ్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక అనంతరం దేశ నిర్మాణంలో ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ పరిరక్షణ అత్యంత కీలకమని, ఆ భావజాలం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని పేర్కొన్నారు. యూపీలో రాబోయే ఎన్నికల్లో వారణాసి నుంచి ఆయన ఎన్నికల బరిలోకి దిగేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications