సరిగ్గా తండ్రి జయంతి నాడే.. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాడు.. మధ్యప్రదేశ్ సంక్షోభంలో గంటకో మలుపు..
మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతున్నది. 18ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటూ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు. అంతకుముందే తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలను(అందులో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు) సింధియా బెంగళూరుకు తరలించారు. ఈ సంఖ్య గంటగంటకూ పెరుగుతూ 22కు చేరింది. వీళ్లందరు కూడా పార్టీకి రాజీనామాలు ప్రకటించారు.
మంగళవారం సాయత్రమే సింధియా అధికారికంగా చేరబోతున్నట్లు సమాచారం. రెబల్స్ తిరుగుబాటుతో కమల్ నాథ్ సర్కారు మైనార్టీలో పడింది. అయితే ఈ గండం నుంచి గట్టెక్కడానికి కాంగ్రెస్ పార్టీ కూడా తన చతురతను ప్రయోగిస్తున్నది. ఆక్రమంలోనే గవర్నర్ కు సీఎం కీలక లేఖలు రాశారు.
Recommended Video


క్యాబినెట్ మొత్తం రాజీనామా..
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ లో చాలా కాలంగా కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా మధ్య చాలాకాలంగా గొడవలు నడుస్తున్నాయి. సోమవారం రాత్రి సడెన్ గా పదుల కొద్దీ మంది ఎమ్మెల్యేలు మాయమైపోవడంతో తాజా ఎపిసోడ్ మొదలైంది. కమల్ నాథ్ ను ఎలాగైనాసరే గద్దెదించాలనుకున్న సింధియా.. బీజేపీతో మిలాఖతై కాంగ్రెస్ పార్టీపై తిరుగుబావుటా ఎగరేశారు. తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలను రాత్రికిరాత్రే బెంగళూరులోని హోటల్ కు తరలించారు. మంగళవారం నాటికి మరో ఎమ్మెల్యే కూడా వారికి తోడయ్యారు. సింధియా వెంట వెళ్లినవారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. దీంతో సీఎం కమల్ నాథ్.. తన కేబినెట్ మంత్రులందరితో రాజీనామాలు చేయించారు. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ కోసమే మంత్రులు రాజీనామా చేశారన్న సీఎం.. గవర్నర్ ఆమోదం కోసం మాత్రం.. సింధియా వెంట వెళ్లిన ఆరుగురు మంత్రుల పేర్లనే పంపడం గమనార్హం.

బీజేపీ జోరు.. శివరాజే మళ్లీ సీఎం..
జ్యోతిరాదిత్య వర్గానికి చెందిన ఎమ్మెల్యేల మద్దతుతో మధ్యప్రదేశ్ లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇన్నాళ్లూ కమల్ నాథ్ సర్కారుకు మద్దతిచ్చిన ఇద్దరు బీఎస్పీ, ఒక సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యులు కూడా కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలూ.. మంగళవారం మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి మద్దతుపై హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ వైపే ఉంటామన్న నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా కాషాయ శిబిరంలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. వ్యూహం ఫలించిన వెంటనే శివరాజ్ సింగ్ చౌహానే మరోసారి సీఎం పదవి చేపడతారని బీజేపీ నేతలు తెలిపారు.

ఘర్ వాపసీ..
మధ్యప్రదేశ్ రాజకుటుంబానికి చెందిన మాధవరావు సింధియా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పనిచేశారు. ఆయన బతికుంటే ఈపాటికి ప్రధానమంత్రి అయ్యుండేవారని అభిమానులు భావిస్తారు. మాధవరావు రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ లో చేరిన జ్యోతిరాదిత్యా.. రాహుల్ గాంధీకి ఆప్తుడిగా వ్యవహరించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లో కొనసాగలేనంటూ ఆయన రాసిన రాజీనామా లేఖను హైకమాండ్ ఆమోదించింది.
కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని కొంతకాలం కిందటే డిసైడైన జ్యోతిరాదిత్య.. సరిగ్గా తన తండ్రి(మాధవరావు) జయంతి(మార్చి 10)రోజునే ఆపని చేశారు. అయితే రాజీనామా లేఖలో మాత్రం నిన్నటి తేదీనే ఉంది. బీజేపీలోకి జ్యోతిరాదిత్య రాకను ఆ పార్టీకి చెందిన కీలక నేత, వరుసకు అత్తయ్యే యషోధరా సింధియా ఆహ్వానించారు. మాధవరావు కూడా తొలుత జన సంఘ్ లోనే పనిచేశారు కాబట్టి జ్యోతిరాదిత్య చేరికను ‘ఘర్ వాపసీ'గా ఆమె అభివర్ణించారు. జ్యోతిరాదిత్య కొడుకు మహానారాయమన్ కూడా తండ్రి నిర్ణయాన్ని సమర్థించాడు.

మోదీ కేబినెట్‌లోకి జ్యోతిరాదిత్య..
20 మంది ఎమ్మెల్యేలను చీల్చేసి, కమల్ నాథ్ సర్కారును చావుదెబ్బ తీసిన జ్యోతిరాదిత్య సింధియాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని బీజేపీ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత లోక్ సభ ఎన్నికల్లో గుణ స్థానంలో ఓడిపోయిన సింధియాను.. ఈనెలలోనే రాజ్యసభకు పంపి.. ఆ వెంటనే కేంద్ర మంత్రి పదవి కట్టబెడతామని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే ఏ పదవి కోసమైతే కమల్ నాథ్ సర్కారును కూల్చేయాలనుకున్నారో.. ఆ సీఎం పదవిని వదులుకోడానికి జ్యోతిరాదిత్య సిద్ధంగా ఉన్నారా? లేదా? అనేదానిపై క్లారిటీ రావాల్సిఉంది.

నంబర్ గేమ్..
మధ్యప్రదేశ్ లో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరదించుతూ 2018లో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 230 స్థానాలకుగానూ 114 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్.. నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 109 స్థానాలతో బీజేపీ బలమైన ప్రతిపక్షంగా నిలబడింది. కాగా, కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన తనకే సీఎం పదవి వస్తుందని జ్యోతిరాదిత్య భావించినా.. చివరి నిమిషంలో హైకమాండ్ కమల్ నాథ్ పేరును ఖరారు చేసింది. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న సింధియా.. సమయం చూసుకుని ప్లేటు ఫిరాయించారు.

కర్నాటక సర్కారుకు ఎంపీ ఎమ్మెల్యేల వినతి..
ప్రస్తుతం బెంగళూరులోని ఓ హోటల్ లో ఉన్న సింధియా వర్గం ఎమ్మెల్యేలు.. తమకు సెక్యూరిటీ కావాలంటూ కర్నాటక ప్రభుత్వాన్ని కోరారు. అక్కడున్నది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఆఘమేఘాల మీద హోటల్ పరిసరప్రాంతాల్లో గట్టి బందోబస్తుకు ఆదేశాలు వెలువడ్డాయి. ఎవరో బలవంతపెట్టినంత మాత్రాన తాము బెంగళూరు రాలేదని.. ఇరవైకి ఇరవై మందీ స్వచ్ఛందంగానే వచ్చామని లేఖలు కూడా రాశారు.












Click it and Unblock the Notifications