మా అమ్మే చాక్లేట్ దొంగ, వద్దన్నా కాటుక పెడుతోంది: ఎస్ఐకి మూడేళ్ల చిన్నారి ఫిర్యాదు(వీడియో)
భోపాల్: ఇటీవల కాలంలో పోలీసులను ఆశ్రయిస్తున్న చిన్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. అయితే, చిన్న చిన్న కారణాలతోనే వారు పోలీస్ స్టేషన్లకు వెళ్లడం హాస్యం తెప్పిస్తోంది. తన పెన్సిల్ పోయిందని ఒకరు.. ఆడుకోనివ్వడం లేదని మరొకరు ఇలా ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా, ఓ మూడేళ్ల బాలుడు ఏకంగా తన తల్లిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అమ్మ పెడుతున్న కాటుక నచ్చదు..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్‌పుర్ జిల్లా దేఢ్‌తలాయి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు సద్దాం ఈ ఫిర్యాదు చేశాడు. అసలు విషయంలోకి వెళితే.. సద్దామ్‌కు వాళ్ల అమ్మ తల స్నానం చేయించాక కాటుక పెడుతుంది. కాటుక పెట్టించుకోవడం అతనికి ఇష్టం లేదు. ఈ క్రమంలో వద్దని అల్లరి చేయడంతో.. తల్లి చెంప మీద మెల్లగా ఒక్కటిచ్చింది. దీంతో సద్దాంకు
ఎక్కడాలేని కోపం వచ్చింది.

అమ్మే చాక్లేట్లు దొంగలిస్తోందంటూ సద్దాం ఫిర్యాదు
వెంటనే తన తండ్రి వద్దకు వెళ్లి.. పోలీస్ స్టేషన్ కు వెళదాం నాతో వస్తావా? అంటూ అడిగాడు సద్దాం. ఏడ్చుకుంటూ అక్కడే కూర్చున్నాడు. దీంతో చేసేదేం లేక సద్దాంను తీసుకుని పోలీస్ స్టేషన్ వెళ్లాడు తండ్రి. అక్కడ ఎస్ఐ ప్రియాంకా నాయక్‌కు సద్దాం తన గోడును వెళ్లబోసుకున్నాడు. తన ఫిర్యాదు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టాడు. మా అమ్మ నాకు కాటుక పెడుతోంది. నా చాక్లెట్లు దొంగతనం చేస్తోంది అని ఎస్ఐకి సద్దాం ఫిర్యాదు చేశాడు.
నవ్వేసిన మహిళా ఎస్ఐ.. చేతులు జోడించి చిన్నారి సద్దాం
చిన్నారి తీరుతో నవ్వుకున్న ఎస్ఐ.. మోకాళ్లపై కూర్చుని సద్దాం నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. సద్దాం చెప్పినదంతా తెల్ల కాగితంపై రాసుకున్నారు. ఆ తర్వాత అతని సంతకం కూడా తీసుకున్నారు. దీంతో సద్దాం కొంత శాంతించాడు. ఆ తర్వాత ఎస్ఐకి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి కృతజ్ఢతలు తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications