మహా కుంభమేళాలో తొక్కిసలాట: 15 మంది మృతి?
Mahakumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభ మేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. దీన్ని ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.
పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు.

అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీన ఆరంభమైన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచీ లక్షలాదిమంది తరలి వెళ్తోన్నారు. గంగా-యమున- సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. 45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుందీ మహా కుంభ్.
మంగళవారం వరకు 15 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే నాలుగున్నర కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు. మౌని అమావాస్య రోజున షాహీ, అమృత్ స్నాన్ కోసం 10 కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది.
దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేసింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపింది. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలనూ తీసుకుంది. ఈ క్రమంలో ఎక్కడికక్కడ బ్యారికేడ్లను అమర్చింది. అయినప్పటికీ- ఈ తొక్కిసలాట సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక్కడి ఘాట్ల వద్దకు వెళ్లే మార్గం మొత్తం భీతావహంగా కనిపించింది. బ్యారికేడ్లన్నీ ఎక్కడికక్కడ పడిపోయి కనిపించాయి. తొక్కిసలాట చోటు చేసుకున్న వెంటనే అధికార యంత్రాంగం శరవేగంగా స్పందించింది. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సుల్లో మోతీలాల్ నెహ్రూ ఆసుపత్రికి తరలించింది.












Click it and Unblock the Notifications