రైతు రుణమాఫీపై కీలక నిర్ణయం
Maharashtra Assembly elections 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో రోడ్‌షోలు, బహిరంగ సభలతో హోరెత్తిపోతోంది మహారాష్ట్ర.
288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తేలేది అప్పుడే.

ఈ పరిస్థితుల మధ్య తాజాగా మహా వికాస్ అగాఢీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. అయిదు గ్యారంటీలను ఇందులో పొందుపరిచింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తామని పేర్కొంది. తెలంగాణ, కర్ణాటకల తరహాలో ఇందులో సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చింది.
అయిదు గ్యారంటీల ఈ మేనిఫెస్టోను కొద్దిసేపటి కిందటే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రమేఫ్ చెన్నితల, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నానా పటోలె, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేసీ వేణుగోపాల్, సుప్రియా సులే ఆవిష్కరించారు.
1. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతినెలా 3,000 రూపాయల ఆర్థిక సహాయం, 2. కులం ప్రాతిపదికన జనాభా లెక్కింపు, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్ తొలగింపు. 3. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని మహా వికాస్ అగాఢీ హామీ ఇచ్చింది.
4. నిరుద్యోగ యువతకు ఉద్యోగం లభించేంత వరకు ప్రతినెలా 4,000 రూపాయల చేయూత, 5. సకాలంలో రుణాలను చెల్లించిన ప్రతి రైతుకూ 50,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహం. అర్హులైన ప్రతి ఒక్కరికీ 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తామని మహా వికాస్ అగాఢీ హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications