షాపింగ్ మాల్‌లో ఆసుపత్రి: పెను అగ్నిప్రమాదం.. కలకలం: 14 అగ్నిమాపక శకటాలతో
ముంబై: ఇప్పటికే వేల కొద్దీ పుట్టుకొస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యతో అతలాకుతలమౌతోన్న ముంబై నగరాన్ని మరో పెను ప్రమాదం ఉలిక్కిపడేలా చేసింది. డిజిగ్నేటెడ్ కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే ఆసుపత్రి యాజమాన్యం అప్రమత్తమైంది. రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.

షాపింగ్ మాల్‌లో ఆసుపత్రి..
ముంబై భండూప్ ప్రాంతంలోని డ్రీమ్స్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆసుపత్రి ఇది. సన్‌రైజ్ హాస్పిటల్ పేరుతో కొనసాగుతోంది. ఓ షాపింగ్ మాల్‌లో ఆసుపత్రి ఏర్పాటు కావడం పట్ల పోలీసులు, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికి అనుమతులు ఉన్నాయా? లేవా? అనేది ఆరా తీస్తున్నారు. ఈ షాపింగ్ మాల్ మూడు, నాలుగు అంతస్తుల్లో ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఆ అంతస్తుల్లోనే గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 72 మంది పేషెంట్లు ఉన్నట్లు గుర్తించారు.

యుద్ధ ప్రాతిపదికన తరలింపు..
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి తొలుత మంటలు వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తొలుత దట్టమైన పొగ వెలువడిందని, దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించే లోపే మంటలు చెలరేగాయి. స్వల్పంగా పేలుళ్ల శబ్దం సైతం వినిపించినట్లు కొందరు పేషెంట్ల బంధువులు తెలిపారు. ఆ వెంటనే అగ్నికీలలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. 70 మంది పేషెంట్లను యుద్ధ ప్రాతిపదికన ఇతర ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నివారణ విభాగం సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు..
14 అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పి వేస్తున్నారు. ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ప్రభాత్ రంగ్‌దలే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రశాంత్ కదమ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. షాపింగ్ మాల్‌లో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం తొలిసారిగా చూస్తున్నానని, కిషోరీ పెడ్నేకర్ వ్యాఖ్యానించారు. ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భండూప్ సహా పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది స్థానికులు సంఘటన స్థలంలో గుమికూడారు. అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్‌ల సైరన్ మోతలతో భండూప్ ప్రాంతం మారుమోగిపోయింది.

వేలకొద్దీ కేసులు..
ముంబైలో వేల కొద్దీ రోజువారీ కరోనా వైరస్ కేసులు పుట్టుకొస్తోన్న విషయం తెలిసిందే. గురువారం నాటి బులెటిన్ ప్రకారం.. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,504 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది మరణించారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో 35,952 కొత్త కరోనా కేసులు రికార్డ్ అయ్యాయి. 111 మంది మృత్యువాత పడ్డారు. 2,62,685 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. దేశంలోని యాక్టివ్ కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రకు చెందినవే.












Click it and Unblock the Notifications