మీరు పులి అయితే.. ఫడ్నవీస్ రింగ్ మాస్టర్.. ఉద్దవ్‌పై సెటైర్.. ‘మహా’లో కార్టూన్ల వార్
మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో భారతీయ జనతాపార్టీ, శివసేన మధ్య అగాథం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. చర్చలు ఓ వైపు కొనసాగిస్తూనే మరో వైపు నేతలు వాగ్భాణాలు విసురుకొంటున్నారు. తాజాగా ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధాన్ని పక్కన పెట్టి కార్టూన్ల వార్‌కు దిగడం ఆసక్తిగా మారింది. మహారాష్ట్ర సీఎం పదవి మాకే ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన రోజే ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తేజిందర్ పాల్ సింగ్ భగ్గా శివసేన పార్టీపై నిప్పులు చెరిగారు. ఇక ఈ కార్టూన్ వార్ గురించి వివరాల్లోకి వెళితే..

సంజయ్ రావత్ వ్యాఖ్యలకు
మహారాష్ట్రంలో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని శివసేన నేత సంజయ్ రావత్ వ్యాఖ్యలు చేసిన వెంటనే తేజిందర్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. మీరు పులైతే.. ఫడ్నవీస్ రింగ్ మాస్టర్. కాస్త ఆలస్యమైనా.. చివరకు మీరు మా వద్దకు రావాల్సిందే అంటూ ఓ కార్టున్‌తో తేజిందర్ సెటైర్లు విసిరారు. దాంతో శివసేన నేతలు కూడా కార్టున్లతో దాడికి దిగారు.

సంజయ్ కౌంటర్
మహారాష్ట్ర ఫలితాలు ప్రకటన ముగిసిన వెంటనే.. శివసేన నేత సంజయ్ రావత్ ఓ కార్టూన్‌ను షేర్ చేశారు. గడియారం లాకెట్ (శివసేన పార్టీ గుర్తు)ను మెడలో వేసుకొన్న పులి.. కమలం (బీజేపీ ఎన్నికల చిహ్నం కమలం)ను వాసన చూస్తున్న కార్టూన్ ఆయన షేర్ చేశారు. దీపావళీ పండుగ ఉంది.. తప్పుగా అర్థం చేసుకోకు అనే క్యాప్షన్‌ను పెట్టి సెటైర్ వేశాడు.

తేజిందర్ ఎన్‌కౌంటర్
సంజయ్ రావత్ పోస్టుకు బదులిస్తూ తేజిందర్ భగ్గా.. సింహాసనంపై దేవేంద్ర ఫడ్నవిస్ కూర్చొని ఉంటూ.. శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే గట్టిగా అరుస్తూ.. నన్ను పెద్దన్న అని పిలువు అంటూ ఉన్న ఓ కార్టూన్ వదిలాడు. దాంతో ఇరు పార్టీల మధ్య కార్టూన్ యుద్ధం ఊపందుకొన్నది. ఈ వ్యవహారంలోకి ఎన్సీపీ దిగి.. నీ తల మీద బాణం గురిపెట్టి ఉంది అనే సామెతను గుర్తు చేశారు.

మహారాష్ట్రలో అనూహ్యమైన పరిణామాలు
ఇదిలా ఉండగా, 50-50 శాతం అధికారాన్ని పంచుకొందామనే అవగాహనపై శివసేన, బీజేపీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కాగా, మహారాష్ట్రలో తాజాగా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకొంటున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన పొత్తు కుదుర్చుకొనే దిశగా అడుగులు పడుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. రానున్న రోజుల్లో అనూహ్యమైన పరిస్థితులు నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications