మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోయిస్టులు హతం
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరౌలీలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సీ 60 కమాండో పోలీసుల బృందం జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల్లో పర్మిలి దళ కమాండర్ బిట్లు మాధవి కూడా ఉన్నారు. మన్నెరజరం అడవుల్లో మొత్తం 25 మంది మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
స్థానికంగా క్యాంపును ఏర్పాటు చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడకు వెళ్లగా.. నక్సల్స్ దాడికి దిగారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు బిట్లు మాధవి సహా మరో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వద్ద నుంచి ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరణించిన నక్సల్స్‌ను పెరిమిలి దళం కమాండర్ బిట్లు మాదవి, పెరిమిలి దళానికి చెందిన వాసు, ఆహేరి దళానికి చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. మార్చి 9న విద్యార్థిని హత్యకేసులో బిట్లు మాధవి ప్రధాన నిందితురాలు.

కాగా, మార్చి 26న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు జరిపిన ఐఈడీ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరిలో 10 మంది పోలీసులు కాగా ఒకరు డ్రైవర్. దంతెవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో బుధవారం ఉదయం డిస్ట్రిక్ రిజర్వ్‌గార్డ్ పోలీసులు.. ప్రత్యేక యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు.
ఆ ఆపరేషన్ ముగించుకుని మినీ వ్యాన్‌లో తిరిగివస్తుండగా.. అరణ్పుర్ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీతో వాహనాన్ని పేల్చేశారు. దాడి జరిగిందని సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం స్థానిక అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భారీగా కూంబింగ్ చేపట్టారు.
మరోవైపు, ఇటీవలే జార్ఖండ్‌లో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సలైట్లు మృతి చెందారు. వీరిలో ఇద్దరిని స్పెషల్ ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. రాజధాని రాంచీకి 160 కి.మీ. దూరంలోని ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై సమాచారం రావడం వల్ల సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపైకి మావోయిస్టులు కాల్పులు జరపగా.. ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటన స్థలంలో రెండు ఏకే-47 తుపాకులు, రెండు నాటు తుపాకులు సహా మరికొన్ని ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications