18నెలలే టైం! బీజేపీని ఢీకొట్ట గలరా?: రాహుల్ ముందున్న కీలక సవాళ్లివే

Recommended Video

    Rahul Gandhi Coronation : కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ తొలి ప్రసంగం

    న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 49వ అధ్యక్షుడిగా అందరూ ఊహించినట్లుగానే రాహుల్ గాంధీ అయ్యారు. అయితే, కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలోనే రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలను తీసుకోవడం పెద్ద సవాలుగానే చెప్పవచ్చు.

    స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో తిరుగులేని శక్తిగా ఉండేది. కానీ, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎదురైన ఘోర పరాభవం ప్రభావం ఇంకా కాంగ్రెస్ పార్టీని వీడటం లేదు. వరుసగా జరుగుతున్న రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క పంజాబ్ రాష్ట్రంలో తప్ప మరే ఇతర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం గమనార్హం.

     132ఏళ్ల చరిత్ర ఇద్దరే నేతలు..

    132ఏళ్ల చరిత్ర ఇద్దరే నేతలు..

    పోటీలో నేను కాదు, మా అమ్మే: సోనియాపై ప్రియాంక గాంధీ

    132ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీ.. మళ్లీ ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారా? అనేది ఇప్పుడు ఆయనకు అతి పెద్ద సవాలేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనూ, దేశ రాజకీయాల్లోనూ శక్తివంతమైన నేతగా ఇందిరా గాంధీ తన ముద్ర వేశారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత ఆ స్థాయి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో కనిపించలేదని చెప్పాలి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో యువ నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్‌ కొత్త బాధ్యతలను ఎలా నిర్వహిస్తారనేదే చర్చనీయాంశంగా మారింది.

     రాహుల్ తన ముద్ర వేస్తారా?

    రాహుల్ తన ముద్ర వేస్తారా?

    రాజీవ్‌ గాంధీ ప్రధాని అయినప్పుడూ ఆయనకు రాజకీయ అనుభవం తక్కువ అన్నవారు ఉన్నారు. రాహుల్‌ అలా కాదు. మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2007లోనే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరించారు. కనుక ఆయనకు తగినంత రాజకీయ అనుభవం ఉన్నట్ట్లేనని చెప్పవచ్చు. ఇకపై పార్టీని ఎంత సమర్థంగా ఆయన నడిపించగలరన్నదే ప్రధాన ప్రశ్న. కాంగ్రెస్‌ను పునరుజ్జీవింప చేసి 2019 ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండేలా చేయగలరో లేదో తేలాలి. నూతన దిశానిర్దేశం చేస్తేనే ఆ పార్టీ బలం పుంజుకోగలుగుతుంది. సోనియా గాంధీ 19 ఏళ్లకుపైగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2004, 2009లో కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఆమె నాయకత్వంలోనే. రాహుల్‌ ఇంతవరకు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో దాదాపు సానుకూల ఫలితాలు లేవనే చెప్పవచ్చు.

     కాంగ్రెస్ ముక్త భారత్-క్షేత్రస్థాయిలోనే సవాళ్లు

    కాంగ్రెస్ ముక్త భారత్-క్షేత్రస్థాయిలోనే సవాళ్లు

    కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో గెలుచుకుంటూ వెళుతోంది. అంతేగాక, పలువురు కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిపోతున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్తాయి నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రాంతీయ పార్టీల కారణంగా రాష్ట్రాల్లోనూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మంచి వక్త అయిన సీనియర్ నేత శశిథరూర్ సేవలను, సోషల్ మీడియా కోసం మాజీ ఎంపీ దివ్యస్పందన సేవలను కాంగ్రెస్ ఉపయోగించుకోవడం ఆ పార్టీకి లాభం చేకూర్చే అంశంగానే చెప్పుకోవచ్చు.

     సీనియర్ల పాత్రేంటి?: యువనేతల అండ-మార్పులు సాధ్యమేనా?

    సీనియర్ల పాత్రేంటి?: యువనేతల అండ-మార్పులు సాధ్యమేనా?

    అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరవాత ఆయన సంస్థాగతంగా మార్పులకు సిద్ధమవుతారా?.. పాత వారందరికీ ఉద్వాసన చెప్పి కొత్త రక్తం నింపుతారా? అన్నది వేచి చూడాలి. రాహుల్‌కు కాంగ్రెస్‌లో యువ నాయకుల మద్దతు ఉందనేది కాదనలేని వాస్తవం. జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలట్‌, రణ్‌దీప్‌ సూర్జే వాలా, అజయ్‌ మాకెన్‌, మిళింద్‌ దేవర, దీపేందర్‌ హూడా, సందీప్‌ దీక్షిత్‌, రాజీవ్‌ సాతవ్‌, గౌరవ్‌ గొగోయ్‌, సుస్మిత దేవ్‌ వంటి యువతరం నాయకులు రాహుల్‌ వెంటే ఉన్నారు. వీరందరూ వంశపారంపర్య రాజకీయ మార్గంలోనే నాయకత్వ స్థానాల్లోకి వచ్చిన వారే కావడం గమనార్హం. ఈ యువనేతల్లో చాలామందికి వాదనా పటిమ, మాట చాతుర్యం ఉన్నాయి.. కానీ, ఎవరూ ప్రజల్లో అంతగా బలం ఉన్నవారు కాకపోవడం కొంత పరిశీలించుకోవాల్సిన అంశం. మరోవైపు సీనియర్‌ నాయకులు గులాం నబీ ఆజాద్‌, మల్లికార్జున్‌ ఖర్గే, కమల్‌నాథ్‌, ఆంటొనీ, చిదంబరం, దిగ్విజయ్‌ సింగ్‌, ఆనంద్‌ శర్మ వంటివారు గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ఇందిరా గాంధీ కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. వీరిని రాహుల్‌ విస్మరించడం కుదరకపోవచ్చు.

     సోనియాకు అహ్మద్ పటేల్‌-రాహుల్‌కు ఎవరు?

    సోనియాకు అహ్మద్ పటేల్‌-రాహుల్‌కు ఎవరు?

    అంతేగాక, యువతరం మద్దతు ఎంత అవసరమో పార్లమెంటులో, పార్టీ నిర్వహణలో సీనియర్లూ అంతే అవసరం. కనుక పాత కొత్తల మేలుకలయికగా ఆయన సలహా బృందం ఉండాల్సిందే. ఇకపై రాహుల్‌ మసలుకోవాల్సిన పద్ధతి సర్వజనామోదయోగ్యంగా ఉండాల్సిందే. సోనియాగాంధీ రోజువారీ రాజకీయాలను అంతగా పట్టించుకోకపోయినా ఆమె తరఫున రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ సకల వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఎంత అధికారం చలాయించినా ఆయన హడావుడి చేసేవారు కాదు. గుట్టుచప్పుడు కాకుండా కాంగ్రెస్‌లో అంతర్గత నియామకాలు, తగవుల పరిష్కారం, అసమ్మతి సెగలను అదుపుచేయడం, యూపీఏ భాగస్వామ్య పక్షాలతో విభేదాలు తలెత్తినప్పుడు పరిష్కరించడం వంటి బాధ్యతలన్నింటినీ ఆయన ఒంటి చేత్తో నిర్వహించారనే చెప్పవచ్చు. అయితే రాహుల్‌ ఆయనను రాజకీయ కార్యదర్శిగా నియమించే అవకాశం కనిపించడం లేదు. ఘర్షణ పరిస్థితులు ఎదురైతే చక్కబెట్టే సామర్థ్యం అహ్మద్‌ పటేల్‌కు ఉంది. పార్టీ వ్యవహారాలపై ఆయనకు ఉన్న అవగాహన రాహుల్‌ గాంధీకీ అవసరమే. గుజరాత్‌ ఎన్నికల్లో పాటీదార్‌ ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్‌, వెనకబడిన తరగతుల నాయకుడు అల్పేశ్‌ ఠాకుర్‌, దళిత నాయకుడు జిగ్నేశ్‌ మేవాని కాంగ్రెస్‌తో చేతులు కలపడం వెనక అహ్మద్‌ పటేల్‌దే కృషి ఉన్నట్లు తెలుస్తోంది.

     అసెంబ్లీ ఎన్నికల సవాళ్లు

    అసెంబ్లీ ఎన్నికల సవాళ్లు

    కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో ఉన్న రాహుల్ గాంధీకి 2018లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల రూపంలో మరో పెద్ద సవాల్ ఎదురుకానుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీని ఓడించడమంటే కష్టసాధ్యమనే చెప్పాలి. అయితే, ఇంతకుముందు కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకున్నా అది రాహుల్ గాంధీకి సానుకూల అంశంగానే చెప్పుకోవచ్చు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వాన్ని మరోసారి నిలబెట్టుకోవడం కూడా రాహుల్ గాంధీకి సవాలేనని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ప్రతికూల వాతావరణం ఏర్పడిందని పలు నివేదికలు వెల్లడించాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. జర్నలిస్టు గౌరీ లంకేష్ తోపాటు బీజేపీ నేతల హత్యలు కూడా సిద్ధ రామయ్య ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

     18నెలల్లోనే.. అతి పెద్ద సవాల్‌గా ‘2019'

    18నెలల్లోనే.. అతి పెద్ద సవాల్‌గా ‘2019'

    మే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి మరో అతిపెద్ద సవాల్ అని చెప్పవచ్చు. 2014లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే అంత తేలికైన పని మాత్రం కాదనే చెప్పాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీపై కాంగ్రెస్ నేతలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నప్పటికీ.. రాజకీయంగా అంత బలంగా ఎదుర్కొనే పరిస్థితి కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలు సర్వేలు 2019లోనూ మోడీనే ప్రధాని కావాలని 80శాతం దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు తేల్చడం గమనార్హం. ఈ నేపథ్యంలో తనకున్న 18నెలల కాలాన్ని రాహుల్ ఏ విధంగా సద్వినియోగం చేసుకుని ఎలా నిలబడతాడో, కాంగ్రెస్ పార్టీని ఎలా నిలబెడతాడో వేచి చూడాల్సిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+