ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లిఖార్జున ఖర్గే: మమత, కేజ్రీవాల్ మద్దతు, కానీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించారు టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎండీఎంకే చీఫ్ వైకో మద్దతు తెలిపారు. అయితే, మల్లిఖార్జున ఖర్గే మాత్రం సున్నితంగా ఈ ప్రతిపాదనను నిరాకరించారు.
ముందుగా సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేద్దామని.. ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దామని మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు. మంగళవారం ఇండియా కూటమి నాలుగో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకంపై కీలకంగా చర్చించారు. ప్రధాని అభ్యర్థి అంశంపైనా ప్రధానంగా చర్చ జరిగింది. తన పేరు ప్రస్తావించడంతో మల్లిఖార్జు ఖర్గే వారించారు. ఎన్నికల తర్వాతనే ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు.

ఇక ఈ సమావేశంలో అసెంబ్లీ సీట్ల పంపంకతోపాటు ఉమ్మడి ప్రచార బ్లూప్రింట్, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి వ్యూహాన్ని రూపొందించడం వంటి వివిధ అంశాలపై ప్రతిపక్ష నాయకులు చర్చించారు. ఇండియా బ్లాక్ మీటింగ్ డిసెంబరు 6న జరగాల్సి ఉండగా.. మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి పలువురు కీలక నేతలు హాజరు కాలేరని చెప్పడంతో వాయిదా వేయాల్సి వచ్చింది.
కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగా ఉండకపోవడం, డిసెంబర్ 13న జరిగిన లోక్‌సభ భద్రతా ఉల్లంఘనపై నిరసనలు, నినాదాలు చేసినందుకు వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో నాలుగో సమావేశంజరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, శరద్ పవార్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, ఉద్దవ్ థాక్రే, ఇతర పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications