నేను ముఖ్యమంత్రి.. నువ్వు ప్రధానమంత్రివి.. నాకు లేఖ పంపేదేంటి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి మోడీపై అగ్రహోదగ్రులయ్యారు. ఢిల్లీలో జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణకు తాను ఎందుకు హాజరుకాలేదో చెప్పారు. ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన తీరు నచ్చలేదని వెల్లడించారు. కోల్ కతాలో జరిగిన ఒక ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ ఒక జూనియర్ స్థాయి అధికారి నుంచి లేఖ వచ్చిందని, సాయంత్రం ఏడు గంటలకు నేతాజీ విగ్రహాన్ని ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించనున్నారని, సాయంత్రం ఆరుగంటలకల్లా అక్కడ ఉండాలంటూ ఆ లేఖలో ఉందని చెప్పారు. తానేమైనా వారికి సేవకురాలినా? అని మమత ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రిని జూనియర్ స్థాయి అధికారి ఎలా ఆహ్వానిస్తారని, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి అంత ఎత్తున ఏమైనా ఉన్నారా అన్నారు. నేతాజీపై ఉన్న గౌరవాన్ని చాటుకోవాలనే మధ్యాహ్నం ఇక్కడే విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించినట్లు చెప్పారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో అనేక మార్పులు చేసింది. ప్రస్తుతం రాజ్ పథ్ గా పిలవబడుతున్న ప్రాంతాన్ని కర్తవ్యపథ్ గా పేరు మార్చింది. అక్కడే నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అధికార కేంద్రాన్ని రాజ్‌పథ్ సూచిస్పేతుంది. ప్రజా సాధికారతకు చిహ్నంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం చేసిన తీర్మానాన్ని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) ఆమోదించింది. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న ప్రాంతాన్ని ఇక నుంచి కర్తవ్యపథ్ అనే పేరుతో పిలవనున్నారు.
కేంద్రానికి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి రాజకీయంగా యుద్ధం నడుస్తోంది. ఒక మంత్రిపై సీబీఐ దాడులు ముగిసి అరెస్టవగానే మరో మంత్రిపై దాడులు మొదలయ్యాయి. తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేంతవరకు మోడీ, షా ద్వయం ప్రతి ప్రభుత్వాన్ని ఇలాగే ఇబ్బందులు పెడతారని, తాను బెంగాల్ టైగర్ నని మమత అన్నారు.












Click it and Unblock the Notifications