బిజెపి వ్యూహం: మమత కంటే కెసిఆర్ లాంటివారే బెట్టర్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఉంటాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. బిజెపి కూడా తామే అధికారంలోకి వస్తామని గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారానికి కొన్ని సీట్లు తక్కువ పడితే ఎవరెవరిని కలుపుకొని పోవాలి అనే అంశంపై బిజెపి అగ్రనేతల్లో చర్చలు జరుగుతున్నాయి.
సొంతగా మెజారిటీ సాధించలేని పక్షంలో తమ తమ కూటములను మరింత విస్తృత పరిచే దిశగా ఇటు ఎన్డీయేతో పాటు అటు యూపిఏ కూడా అడుగులు వేస్తున్నాయి. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్‌లు శని, ఆదివారాల్లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఎన్నికల అనంతర పొత్తులపైనే వీరి నడుమ ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. యూపీ, బీహార్‌ల్లో అనుకున్నస్థాయిలో పార్టీ రాణించని పక్షంలో కేంద్రంలో అధికార పీఠానికి కొద్ది దూరంలో ఆగిపోవాల్సి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అదే జరిగితే ఏం చేయాలన్న దానిపై పక్కా కార్యాచరణను బిజెపి, ఆరెస్సెస్ సిద్ధం చేశాయి.
అదే 'విశాల ఎన్డీయే' వ్యూహం. మేజిక్ ఫిగర్ 272ను దాటలేని పక్షంలో ఈ వ్యూహాన్ని తెరపైకి తీసుకురావాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా ఎన్డీయేను మరింత విస్తృతపర్చి మరింత ఎక్కువ మంది భాగస్వాములను ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించనున్నారు.
జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె, మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌ల కన్నా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, బిజూ జనతాదళ్, తెరాసలకు ప్రాధాన్యం ఇవ్వాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. జయ, మమతల డిమాండ్లకు తలొగ్గి సంకీర్ణాన్ని నడపడం అంత తేలికకాదని, అందుకే చిన్న పార్టీల వైపు మొగ్గు చూపాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications