చచ్చిపోతున్నా వదలకుండా మొబైల్ లూటీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వం మంటకలిసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తిని గాలికి వదిలేశారు. కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.
రోడ్డు పక్కన పడిపోయిన అతని మొబైల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటన వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన మతిబూల్ (40) అనే వ్యక్తి ఢిల్లీ చేరుకుని ఈ-ఆటో రిక్షా నడుపుకుంటున్నాడు.
ఇతను పగటిపూట రిక్షా నడపడం, రాత్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఢిల్లీలోని సుభాష్ నగర్ లో వేకువ జామున 5.30 గంటల సమయంలో నడిచి వెలుతున్న మతిబూల్ ను టెంపో డీకొనింది.
తీవ్రగాయాలైన అతను రోడ్డు పక్కనే పడిపోయాడు. అతని మొబైల్ ఫోన్ దూరంగా పడిపోయింది. అటు వైపు వెలుతున్న వారు విషయం గుర్తించినా కనీసం సహాయం చెయ్యడానికి ముందుకురాలేదు.

అదే రోడ్డులో వెలుతున్న ఓ ఆటో డ్రైవర్ వాహనం నిలిపి దూరంగా పడి ఉన్న మొబైల్ ఫోన్ ఎత్తుకుని దర్జాగా జోబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం 7 గంటల సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
బాధితుడు మతిబూల్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రక్తం ఎక్కువ పోవడంతో అతను మరణించాడని వైద్యులు చెప్పారు. ప్రమాదానికి కారణం అయిన టెంపో డ్రైవర్ వాహనం నిలిపి కిందకు దిగి చూసి వెళ్లి పోయాడని పోలీసులు చెప్పారు.
సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, అతని జోబులో ఉన్న పత్రాల ఆధారంగా పూర్తి వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications