వ్యక్తి చనిపోతుంటే ఇలానా: పోలీసులపై ఫైర్(వీడియో)
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో మానవత్వాన్ని మంటగిలిపే సంఘటన ఒకటి జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని అలానే అరగంటపాటూ వదిలేసి అతని మరణానికి కారణమయ్యారు అక్కడి పోలీసులు. మానత్వం లేని ఆ పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురంలోని ఈస్ట్ ఫోర్ట్ సమీపంలో ఆదివారం విక్రం సారాబాయ్ స్పేస్ సెంటర్ కు చెందిన వాహనం ఓ వృద్ధున్ని ఢీకొట్టింది. అక్కడే ఉన్న పోలీసులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధున్ని అరగంట పాటూ ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించలేదు.
రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతన్ని అలానే వదిలేసి అంబులెన్స్ వచ్చే వరకు పోలీసులు వేచి చూశారు. దీంతో తీవ్రరక్తస్రావం జరిగి ఆ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. జరిగిన సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి ఇంటర్నెట్‌లో పెట్టడంతో పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవత్వం లేని ఆ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఆ వ్యక్తికి తీవ్రగాయాలవ్వడంతో స్ట్రెచర్ లేకుండా తీసుకు వెళ్లడం ఆ వ్యక్తి ప్రాణానికే ప్రమాదమని తాము భావించామని పోలీసులు చెప్పారు. అందుకే అంబులెన్స్ వచ్చే వరకు ఆగాల్సి వచ్చిందన్నారు. అతని రెండు కాళ్లు దాదాపు శరీరం నుంచి విడిపోయాయని అందుకే తమ జీపులో తీసుకువెళ్లలేకపోయామని పోలీసులు తెలిపారు.
ఆయితే ఆ వృద్ధునికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అతను కేరళకు చెందిన వ్యక్తి కాదని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం అతని మృతదేహాన్ని తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఉంచారు.












Click it and Unblock the Notifications