కోర్టులో జడ్జిపై చెప్పు విసిరిన అండర్ ట్రయల్ ఖైదీ... రెండేళ్ల కఠిన కారాగార శిక్ష....
మహారాష్ట్రలోని థానే కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా జడ్జిపై దాడి చేసిన అండర్ ట్రయల్ ఖైదీకి అదే జడ్జి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఇలాంటి చర్యలను కోర్టు తీవ్ర నేరంగా పరిగణిస్తుందన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నేవీ ముంబైకి చెందిన గణేశ్ లక్ష్మణ్ గైక్వాడ్ (35) ఓ కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా థానే జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జూన్ 28,2019న ఈ కేసు థానే అడిషనల్ సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చింది. పోలీసులు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా... అతని తరుపున వాదించాల్సిన న్యాయవాది గైర్హాజరయ్యాడు. న్యాయమూర్తి ఆర్ఎస్ గుప్తాకు నిందితుడు ఇదే విషయాన్ని వెల్లడించాడు. స్పందించిన న్యాయమూర్తి అతనికి బదులు మరో న్యాయవాదిని ఇస్తామని చెప్పారు. కేసును తదుపరి విచారణ తేదీకి వాయిదా వేశారు.

కేసు మళ్లీ వాయిదా పడటంతో ఆగ్రహించిన నిందితుడు గణేశ్ గైక్వాడ్ తన కాలి చెప్పును న్యాయమూర్తి పైకి విసిరాడు. అసభ్య పదజాలంతో ఆయన్ను దూషించాడు. దీంతో న్యాయమూర్తిపై దాడి కింద అతనిపై కేసు నమోదైంది. మార్చి 5న దీనిపై విచారణ చేపట్టిన అదే న్యాయమూర్తి గుప్తా ఐపీసీ సెక్షన్ 353(ప్రభుత్వ ఉద్యోగిపై దాడి) సెక్షన్ 294(బహిరంగ ప్రదేశంలో అసభ్య పద దూషణ) కింద అతనికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.
గతంలో ముంబైలోని దిందోషి సెషన్స్ కోర్టులోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.న్యాయవాది గెటప్‌లో కోర్టులోకి వచ్చిన ఓ వ్యక్తి ఇనుప రాడ్డును జడ్జి మీదకు విసిరారు.దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన సోదరుని హత్య కేసులో సాక్షిగా ఉన్న ఆ వ్యక్తి కోర్టు వాయిదాలకు రావట్లేదన్న కారణంతో జడ్జి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో లాయర్ గెటప్‌లో కోర్టుకు వచ్చిన అతను జడ్జిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కోర్టులో తీవ్ర కలకలం రేపింది.












Click it and Unblock the Notifications