హుధుద్: ఏడుగుర్ని రక్షించిన సాహసి సహదేవ్ మృతి
భువనేశ్వర్: ఒడిశాలో ప్రాణాలకు తెగించి ఏడుగురు మహిళలు, చిన్నారులను కాపాడిన ఓ సాహకి ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. హుధుద్ తుఫాను ముప్పు నేపథ్యంలో శనివారం ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో పెద్ద ఎత్తున తరలింపు చర్యలు చేపట్టారు.
సతభయా ప్రాంతంలో గర్భిణీలను, చిన్నారులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఒక మరపడవ ప్రమాదవశాత్తు మొసళ్లు ఉన్న బవున్‌సగాడి వాగులో మునిగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న బాధితులు సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. వారిని పలువురు కాపాడారు.
అక్కడే ఉన్న 40 ఏల్ల సహదేవ్ సమాల్ కూడా నీళ్లలోకి దూకారు. సహదేవ్ సమాల్ మంచి ఈతగాడు. దీంతో, అతను ఏడుగురు మహిళలు, చిన్నారులను రక్షించారు. వారిని రక్షించే ప్రయత్నంలో ఆయన చల్లని వాతావరణంలో ఎక్కువ సేపు ఉండవలసి వచ్చింది.

దీంతో, న్యూమోనియా సమస్య ఉన్న ఆయనకు ఇది ప్రమాదకరంగా పరిణమించింది. సహదేవ్ ప్రాణాలను కాపాడేందుకు శతధా ప్రయత్నించామని, అయినా ఫలితం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. సహదేవ్ వల్ల ప్రాణాలతో బయటపడ్డ వారు ఈ విషయం తెలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఉత్తరాంధ్రపై పంజా విసిరిన హుధుద్ తుపాను సోమవారం ఉదయానికి శాంతించింది. గండం గడిచింది. తుపాను బలహీనపడి జగదల్‌పూర్‌వైపు పయనిస్తోందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. విశాఖపట్నంలో తుపాను తీవ్రత తగ్గింది. తుపాను ప్రభావంతో మిగిలిన విధ్వంసం మాత్రం అంతా ఇంతా కాదు. వర్షం కూడా ఆగింది.
విశాఖలో చల్లటిగాలులు నిన్నటిమీద తగ్గాయి. కాని శ్రీకాకుళంలో మాత్రం ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. చల్లటి గాలులు మాత్రం బాగా వీస్తున్నాయి. ఉత్తరాంధ్రలో తుపాను మిగిల్చిన విషాదంనుంచి ఇప్పట్లో బయటపడడం కష్టమని చెబుతున్నారు. జీవనాధారాన్ని జలవిలయం తన్నుకుపోవడంతో తీరం వెంట బడుగుజీవులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
మంచినీటి సరఫరా లేక, విద్యుత్ సరఫరా లేక, పాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. తుపాను బాధిత ప్రాంతాలలో ఎక్కడ చూసినా ప్రజల కడగండ్లు వర్ణనాతీతం. ఇటు ఉత్తరాంధ్రతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో కూడా హుధుద్ తుపాను ప్రభావం వల్ల వేల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలిపోయాయి.












Click it and Unblock the Notifications