ఉగ్రవాదిది నకిలీ ఎన్ కౌంటర్: హెడ్ కానిస్టేబుల్
ఇంపాల్: 2009లో జరిగిన పీఎల్ఏ ఉగ్రవాది ఎన్ కౌంటర్ పై మణిపూర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పై అధికారి ఆదేశాల మేరకు ఉగ్రవాదిని నకిలీ ఎన్ కౌంటర్ లో అంతం చెయ్యవలసి వచ్చిందని ఓ జాతీయ టీవీ చానెల్ ఇంటర్వూలో సంచలన ప్రకటన చేశారు.
ఇప్పుడు తన ప్రాణలకుముప్పు ఉందని హెడ్ కానిస్టేబుల్ హిరోజిత్ సింగ్ ఆరోపిస్తున్నారు. 2009లో పీఎల్ఏ ఉగ్రవాది సంజిత్ మెయితీని పోలీసులు అరెస్టు చేశారు. తరువాత ఇంపాల్ అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు తాము సంజిత్ మెయితీని నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లామని హీరోజిత్ సింగ్ చెప్పారు.
అనంతరం అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు నిరాయుధుడైన సంజిత్ మెయితీని మీద 9 ఎంఎం పిస్తోల్ తో బుల్లెట్ ల వర్షం కురిపించామని హెడ్ కానిస్టేబుల్ హిరోజిత్ సింగ్ చెప్పాడు. చాతిలోకి బుల్లెట్ లు దూసుకు వెళ్లడంతో సంజిత్ అక్కడే కుప్పకూలి మరణించాడని హిరోజిత్ సింగ్ అన్నాడు.

ఇంపాల్ అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు తాను నకిలీ ఎన్ కౌంటర్ చెయ్యవలసి వచ్చిందని, ఈ విషయం డీజీపీ, ముఖ్యమంత్రికి తెలుసు అని హిరోజిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిరోజిత్ సింగ్ పై సంజిత్ మెయితీని తల్లి మండిపడుతున్నారు.
నకిలీ ఎన్ కౌంటర్ చేసిన హెడ్ కానిస్టేబుల్ హిరోజిత్ సింగ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రతికారం తీర్చుకోవడానికి హిరోజిత్ సింగ్ ను తమకు అప్పగించాలని సంజిత్ తల్లి డిమాండ్ చేస్తున్నారు.
తన కుమారుడిని అనుమానిత ఉగ్రవాది అంటూ అరెస్టు చేసి తీసుకు వెళ్లి నకిలీ ఎన్ కౌంటర్ చేశారని ఆమె శాపనార్థాలు పెడుతున్నారు. 2009లో సంజిత్ ఎన్ కౌంటర్ అయిన సమయంలో యువకుడిని అన్యాయంగా చంపేశారని మణిపూర్ లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.












Click it and Unblock the Notifications