Manipur elections: ఎన్నికలు జరగనున్న మణిపూర్‌లో పేలుడు; ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు
ఫిబ్రవరి 28వ తేదీన పోలింగ్ జరగనున్న మణిపూర్‌లో ఎన్నికల వేళ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారని సమాచారం. ఎన్నికలు జరగనున్న మణిపూర్ రాష్ట్రంలో ఐఈడీ పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. మొదటి దశ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న సమయంలో జరిగిన ఐఈడీ పేలుడు నేపధ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి)కి చెందిన ఇద్దరు సిబ్బంది ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఇడి) పేలుడులో గాయపడ్డారని అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని కక్చింగ్ జిల్లాలోని వాంగూ తేరా ప్రాంతంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడులో కానిస్టేబుళ్లు గౌరవ్ రాయ్, గిరిజా శంకర్‌లకు గాయాలైనట్లు వారు తెలిపారు. పేలుడు జరిగినప్పుడు రాష్ట్ర పోలీసు సిబ్బందితో పాటు ఐటీబీపీ పార్టీ ఏరియా డామినేషన్ పెట్రోలింగ్ నిర్వహిస్తోందని వారు తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికల విధుల కోసం మోహరించిన 610 ఐటీబీపీ ఎన్నికల బెటాలియన్‌లోని 'ఈ ' కంపెనీలో ఈ దళాలు భాగంగా ఉన్నాయని సమాచారం. గాయపడిన సైనికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, వారిని కక్చింగ్ సివిల్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. పేలుడుకు గల కారణాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగి సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు.

ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం కూడా మణిపూర్లో ఐఈడి పేలుడు సంభవించింది. రాజధాని ఇంఫాల్ సమీపంలోని ఓ గోడౌన్ గేటు వద్ద ఈ పేలుడు జరిగింది. పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అప్పుడు ఎవరికీ ఎటువంటి ప్రాణహాని సంభవించలేదు. ఎన్నికల ముందే మణిపూర్ లో హింసాత్మక ఘటనలు, బాంబు పేలుళ్లు చోటు చేసుకోవటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో భయాందోళనకు కారణంగా మారుతుంది.
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో ఈశాన్య రాష్ట్రం అయిన మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మణిపూర్ లో 38నియోజకవర్గాలలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 22 నియోజకవర్గాలలో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.












Click it and Unblock the Notifications