మణిపూర్‌లో మరో దారుణం: ఇద్దరు మైతీ విద్యార్థుల కిడ్నాప్, దారుణ హత్య
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా, ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. జులై నెలలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం కాగా. .వారి మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ అయ్యింది. విద్యార్థుల మరణానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది.
ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను కనుగొనేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కూడా రంగంలోకి దిగింది. మైతీ కమ్యూనిటీకి చెందిన హిజమ్ లిన్జోఇంగంబి(17), ఫిజామ్ హేంజిత్(20)లను సాయుధులైన కొందరు అటవీ ప్రాంతంలోని ఓ చెట్టు వద్ద బంధించినట్లు ఆ ఫొటోలు, వీడియోల ద్వారా తెలుస్తోంది. వారి వెనుకాల తుపాకులు పట్టుకుని ఉన్నారు కొందరు.

ఆ తర్వాత ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్లు ఫొటోలు ఉన్నాయి. సాయుధులైన దుండగులు వారిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. విద్యార్జులు కనిపించకుండా పోయి రెండు నెలలు గడుస్తున్నా.. వారి ఆచూకీ కోసం ప్రయత్నించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ ఇద్దరు విద్యార్థులు వెళుతున్న దృశ్యాలు పలు సీసీ కెమెరాల్లో రికార్డయినప్పటికీ.. వారి ఆచూకీని కనిపెట్టకపోవడంపై మండిపడుతున్నారు. అయితే, వారిని నిందితులు కిడ్నాప్ చేసి అపహరించి, హత్య చేసినట్లు తెలుస్తోంది. తాజాగా, వారి మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటికి రావడంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుకీ మిలీషియానే ఈ దారుణానికి తెగబడిందని మైతీ వర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితులను పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసును సీబీఐకి కూడా అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపింది.
కాగా, షెడ్యూల్డ్ తెగల (ST) హోదా కోసం మెయితీల డిమాండ్‌పై కుకీలు చేసిన నిరసన తర్వాత మే 3న కొండ-మెజారిటీ కుకీ తెగలు, లోయ-మెజారిటీ మెయిటీస్ మధ్య జాతి హింస మొదలైంది. 180 మందికి పైగా మరణించారు, వేలాది మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.












Click it and Unblock the Notifications