మణిపూర్‌లో మళ్లీ అలజడి: కేంద్రమంత్రి ఇంటిపై ఆందోళనకారుల దాడి, కాల్పులు
ఇంఫాల్: మరోసారి మణిపూర్ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఆర్కే రంజన్ సింగ్ నివాసంపై శుక్రవారం ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. ఇంఫాల్‌లోని కేంద్రమంత్రి ఇంటిపై గురువారం రాత్రి 9 గంటల సమయంలో రాళ్లతో దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. టియర్ గ్యాస్ ప్రయోగించారు.
అయినా, ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో నిరసనకారులు అక్కడ్నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వివరాలను శుక్రవారం అధికారులు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో నిన్నమొన్నటి వరకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగిన విషయం తెలిసిందే. మరోవైపు, రాష్ట్ర అటవీశాఖ మంత్రి బిశ్వజిత్ సింగ్ ఇంటిపైనా ఆందోళనకారులు విఫలయత్నం చేశారు. ఆయన ఇంటి వద్ద పటిష్ట బందోబస్తు ఉండటంతో ఆందోళకారులు వెనక్కి తగ్గారు.

మణిపూర్‌లో గిరిజనుల మధ్య తలెత్తిన వివాదం పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం లేదిన ఆందోళనకారులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి నివాసంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. కాగా, దాడి జరిగిన సమయంలో కేంద్రమంత్రి రంజన్ సింగ్ ఇంట్లోనే ఉండటం గమనార్హం. ఈ ఘటనతో శుక్రవారం ఉదయం ఆయన ఢిల్లీకి వెళ్లారు. అంతకుముందు గవర్నర్ అనుసూయతో భేటీ అయిన కేంద్రమంత్రి రంజన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.
త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన
మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్‌లో మరికొన్ని రోజుల్లో పర్యటిస్తానని ప్రకటించిన కొద్ది సేపటికే ఈ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. గౌహతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా.. త్వరలోనే మణిపూర్‌లో పర్యటిస్తానని చెప్పారు. మూడు రోజులు అక్కడే ఉండి ప్రజలతో శాంతి నెలకొనేలా చూస్తానని హామీ ఇచ్చారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సూచించారు. అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు కేంద్రమంత్రి అమిత్ షా.












Click it and Unblock the Notifications