కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికపై అనుమానాలు లేవనెత్తిన సీనియర్
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడు రాబోతోన్నాడు. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ త్వరలో ప్రారంభం కాబోతోంది. సుదీర్ఘ విరామం తరువాత కాంగ్రెస్‌కు తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడు అధ్యక్ష పదవిని అందుకోబోతోండటం ఖాయమైంది. సోనియా గాంధీకి ఆరోగ్య సహకరించకపోవడం, ఆమె స్థానంలో సారథ్య బాధ్యతలను చేపట్టడానికి రాహుల్ గాంధీ అంగీకరించకపోవడం వంటి పరిణామాల మధ్య గాంధీయేతర కుటుంబ నాయకుల చేతికి కాంగ్రెస్ వెళ్లనుంది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17వ తేదీన ఎన్నిక జరుగనుంది. 19వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీనికి సంబంధించిన ఓ తీర్మానాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఇటీవలే ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. హెల్త్ చెకప్ కోసం సోనియా గాంధీ అమెరికా వెళ్లారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆమె వెంటే ఉన్నారు. ఈ ముగ్గురూ సీడబ్ల్యూసీ వర్చువల్ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి నిర్వహించ దలిచిన ఎన్నికల షెడ్యూల్‌ను ఈ సీడబ్ల్యూసీ భేటీలో ఖరారు చేశారు.

ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్‌లో మరో నిరసన గళం వినిపిస్తోంది. ఇదివరకు గులాం నబీ ఆజాద్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆ తరువాత ఆనంద్ శర్మ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్‌గా తప్పుకొన్నారు. ఇప్పుడు తాజాగా మనీష్ తివారీ కూడా వారి సరసన చేరినట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల ప్రక్రియను ఆయన ప్రశ్నించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అధ్యక్ష పదవి ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిపించాల్సిన బాధ్యత పార్టీ అధిష్ఠానంపై ఉందని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఉద్దేశించిన ఎలక్టోరల్ జాబితాను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీన్ని పార్టీ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సూచించారు. వ్యాలిడ్ ఎలక్టోరల్స్ ఎంతమంది ఉన్నారో తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అధ్యక్షుడి పేరును ప్రతిపాదించిన వ్యక్తికి పార్టీలో వ్యాలిడ్ ఎలక్టోరల్‌గా ఉన్నాడా? లేదా? బహిర్గతం చేయాలని చెప్పారు.












Click it and Unblock the Notifications