సిద్ధరామయ్యతో విభేదాలపై తేల్చేసిన డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 135 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 43 శాతానికి పైగా ఓట్ల షేర్‌ను సాధించింది కాంగ్రెస్. 1989 తరువాత ఈ స్థాయి ఓట్ షేర్‌ను కాంగ్రెస్ అందుకోవడం ఇదే తొలిసారి.
కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి ఇవ్వాళ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది. ఈ సాయంత్రం 5:30 గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఈ భేటీ ఏర్పాటయింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి ప్రధాన కారకులైన డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యల్లో ఒకరిని ముఖ్యమంత్రి పదవి వరిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో- డీకే శివకుమార్ తన ఆధ్యాత్మిక గురువు మఠాన్ని సందర్శించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి తుమకూరు జిల్లాలోని నోనవినకెరెకు బయలుదేరి వెళ్లారు. అక్కడి కడసిద్ధేశ్వర మఠానికి చేరుకుని, ప్రత్యేక పూజలు చేశారు. గంగాధరేశ్వర అజ్జయ్య, వృషభ దేశికేంద్ర మఠాధిపతి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడే విలేకరులతో మాట్లాడారు.

సిద్ధరామయ్యతో తనకు విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందని, ఇందులో వాస్తవం లేదని అన్నారు. సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. చాలా సందర్భాల్లో పార్టీ కోసం ఎంతో త్యాగం చేశానని, అనేక సందర్భాల్లో సిద్ధరామయ్యకు అండగా నిలిచానని అన్నారు. ఈ మఠం తనకు పవిత్ర స్థలమని వ్యాఖ్యానించారు.

తనపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగినప్పుడు కూడా అజ్జయ్య స్వామీజీ ధైర్యం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 134 సీట్లు కావాలని తాను స్వామీజీని అడిగానని, అంతకంటే ఎక్కువ స్థానాలే లభించాయని డీకే శివకుమార్ పేర్కొన్నారు. తన జీవితంలో అనేక కీలక సందర్భాల్లో ఈ మఠాన్ని దర్శించానని, ఇది తనకు అత్యంత పవిత్రమైనదని చెప్పారు.












Click it and Unblock the Notifications