మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు... ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో, తెలంగాణాలోనూ హై అలెర్ట్
మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నేపథ్యంలో ఆంధ్ర ఒడిశా బోర్డర్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. జులై 28వ తేదీ నుండి వారం రోజుల పాటు జరగనున్న మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తారని భావిస్తున్న క్రమంలో ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు.

మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాల నేపధ్యంలో విశాఖ ఏజెన్సీలో హై అలెర్ట్
విశాఖ ఏజెన్సీలో మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాల నేపధ్యంలో వాహనాలను జోరుగా తనిఖీ చేస్తున్నారు. రంగంలోకి దిగిన అదనపు పోలీసు బలగాలు విశాఖ ఏజెన్సీ ప్రాంతాన్ని అడుగడుగున గాలిస్తున్నాయి. ఇన్ఫార్మర్ల నెపంతో గిరిజనులను మిలిషియా నాయకులు హతమార్చే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు, ఈ క్రమంలోనే ముందస్తు చర్యలకు దిగినట్లుగా సమాచారం. ఇదే సమయంలో చత్తీస్ గడ్ దండకారణ్యంలో పోలీసులు, మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు.

జోరుగా సాగుతున్న కూంబింగ్ ఆపరేషన్లు
ఎక్కడికక్కడ కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు ఏర్పాటుచేసే సమావేశాల్లో పాల్గొనవద్దని, వాళ్ళ మాయ మాటలు నమ్మవద్దని పోలీసులు గిరిజనులను హెచ్చరిస్తున్నారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో చత్తీస్ గడ్ సుక్మా జిల్లా చింతకుంట ప్రాంతంలో సిఆర్పిఎఫ్ కు చెందిన రెండు బెటాలియన్లు, డీఆర్ జి, ఎస్ టి ఎఫ్ భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది.

తెలంగాణాలోనూ అటవీ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్న పోలీసులు
జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల అమరవీరుల వారోత్సవం జరుగనున్నందున, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాల్లోని తెలంగాణ-ఛత్తీస్ గడ్ సరిహద్దులోని ఏజెన్సీ గ్రామాల్లో భద్రతను కఠినతరం చేశారు. సిపిఐ-మావోయిస్టుల పేరిట పోస్టర్లు, కరపత్రాలు ములుగులోని వాజేడు, వెంకటాపురం మండలంలో ఇప్పటికే వెలిశాయి .అమరవీరుల వారంలో మావోయిస్టులు హింసకు పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్ విభాగం నుండి వచ్చిన సమాచారం తో, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
Recommended Video

ఎరుపెక్కిన దండకారణ్యం .. మావోలకు పోలీసులకు మధ్య ప్రచ్చన్న యుద్ధం
ఈ వారం రోజుల పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి సిఆర్పిఎఫ్ మరియు గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. ఇప్పటికే మావోయిస్టులు, పోలీసులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న సమయంలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలతో దండకారణ్యం మరోమారు ఎరుపెక్కింది. అడవిలో నిశ్శబ్ద యుద్ధం మొదలైంది.












Click it and Unblock the Notifications