
మీజిల్స్: తట్టు వ్యాధి తిరగబెడుతోందా, మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

కరోనా సంక్షోభం తగ్గుముఖం పడుతోందిగానీ, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో తట్టు (మీజిల్స్) వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది.
తట్టు ఒక అంటు వ్యాధి. శరీరంపై చిన్న చిన్న పొక్కులా వస్తాయి. దీన్ని టీకాల ద్వారా మాత్రమే నివారించవచ్చు.
తట్టు వస్తే ఏం చేయాలి? ఏం చేయకూడదు? లక్షణాలేంటి? తెలుసుకుందాం.
1. తట్టు అంటే ఏమిటి?
తట్టు ఒక అంటువ్యాధి. ఇది 'పారామైక్సోవైరస్' అనే వైరస్ ద్వారా వ్యాపిస్తుంది.
తట్టుతో బాధపడుతున్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా ఆ వ్యక్తి లాలాజలం నుంచి వైరస్ గాలిలో కలుస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తికి కూడా ఇది సంక్రమించవచ్చు.
తట్టు లక్షణాలు సాధారణంగా రెండవ వారంలో బయటపడతాయి. తట్టు ఉన్న వ్యక్తిని నేరుగా కలిసినా ఇన్‌ఫెక్షన్ సోకవచ్చు.
2. తట్టు లక్షణాలు ఎలా ఉంటాయి?
పిల్లల్లో జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, కళ్ల మంటలు, కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అయిదు నుంచి ఏడు రోజుల తరువాత శరీరంపై ఎర్రటి పొక్కులు కనిపిస్తాయి. కొన్నిసార్లు నోటిలో తెల్లటి మచ్చలు వస్తాయి.
3. లక్షణాలు కనిపించగానే ఏం చేయాలి?
తట్టు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రక్తపరీక్ష ద్వారా వ్యాధి నిర్థరణ కాగానే మందులు వాడడం మొదలుపెట్టాలి.
సొంత వైద్యం వద్దు. వంటింటి చిట్కాలు అసలు పాటించవద్దు. ఇది వ్యాధిని తీవ్రతరం చేస్తుంది. న్యుమోనియాకు దారితీస్తుంది.
4. తట్టు ఎవరికి రావచ్చు?
టీకాలు వేయని పిల్లలకు తట్టు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
గర్భిణీ స్త్రీలకు కూడా మీజిల్స్ సోకే అవకాశం ఉంది.
మీజిల్స్ వ్యాక్సిన్ తీసుకోని వారెవరికైనా తట్టు రావచ్చు.

5. మీజిల్స్ వ్యాక్సీన్ అంటే ఏమిటి? ఎంత మోతాదులో తీసుకోవాలి?
పిల్లలకు మీజిల్స్ వ్యాక్సీన్‌తో పాటు రూబెల్లా వ్యాక్సీన్‌ను రెండు డోసులలో ఇస్తారు.
తొమ్మిది నుంచి 12 నెలల వయసులో మొదటి డోసు, 16 నుంచి 24 నెలల వయసులో రెండవ డోసు వ్యాక్సీన్ వేస్తారు.
6. చిన్నప్పుడు టీకా వేయించుకుంటే చాలా?
అవును. నెలల వయసులో రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకుంటే, ఇక జీవితాంతం తట్టు గురించి భయపడక్కర్లేదు.
7. తట్టు రాకుండా విటమిన్ ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలి?
విటమిన్ ఏ లోపం ఉన్న పిల్లలు తట్టు వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువ.
అలాగే, తట్టు వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే, శరీరంలో ద్రవాలు తగ్గిపోతాయి. దీని కారణంగా విటమిన్ ఏ స్థాయి పడిపోతుంది.
అందుకే, మీజిల్స్ రోగులకు పోషకాహారంతో పాటు రోజూ తగిన మోతాదులో విటమిన్ ఏ అందిస్తారు. ఇది మరణం దాకా వెళ్లకుండా అడ్డుకుంటుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.

8. వేపాకులు ప్రయోజనం చేకూరుస్తాయా?
తట్టు సంక్రమిస్తే దురద, పొక్కులతో పాటు జ్వరం కూడా ఉంటుంది. వేపలో ప్రకృతి సహజంగా దురద తగ్గించే గుణం ఉంటుందని, స్నానం చేసే నీళ్లల్లో వేపాకులు వేయడం మేలు చేస్తుందని చాలామంది భావిస్తారు.
"దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఇది వైరల్ వ్యాధి. లక్షణాల బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది" అని మహారాష్ట్రలోని రోగ సర్వే అధికారి డాక్టర్ ప్రదీప్ అవటే చెప్పారు.
చీము పట్టకుండా ఉండడానికి, వేపాకులను క్రిమినాశికలుగా ఉపయోగించవచ్చని ఆయన సూచించారు.
9. తట్టును మహమ్మారిగా చూడవచ్చా?
ప్రస్తుతం ఇది గ్లోబల్ ఎపిడెమిక్ కాదు. కానీ, అనేక దేశాలలో దీని వ్యాప్తి కనిపిస్తోంది.
ముంబైలో తట్టు కారణంగా కొన్ని మరణాలు సంభవించాయి. కరోనా మహమ్మారి సమయంలో అనేకమంది పిల్లలకు తట్టు వ్యాక్సీన్ లభించలేదు.
సుమారు 4 కోట్ల మంది పిల్లలకు మీజిల్స్ టీకాలు అందలేదని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది.
మీజిల్స్‌ను నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా 95 శాతం జనాభాకు టీకాలు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
అయితే, ఈ రేటు ప్రస్తుతం 81 శాతానికి తగ్గింది. ఇలాంటి పరిస్థితులలో మీజిల్స్ వ్యాప్తి ఎక్కువగా ఉండవచ్చు.
10. తట్టు ఎంత ప్రమాదకరమైనది?
గతంలో, రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి మీజిల్స్ వ్యాధి విజృంభించేది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 26 లక్షల మంది మరణించేవారు.
1963లో మీజిల్స్ వ్యాక్సీన్‌ను కనుగొన్న తరువాత ఈ వ్యాధి తగ్గుముఖం పట్టింది.
కానీ, 2021లో ప్రపంచవ్యాప్తంగా లక్షా 28 వేల మంది మీజిల్స్ కారణంగా మరణించారు.
కాబట్టి మీరు, మీ పిల్లలు మీజిల్స్, రూబిల్లా వ్యాక్సీన్లు వేయించుకోకపోతే, త్వరపడండి. వెంటనే టీకాలు వేయించుకోండి.
ఇవి కూడా చదవండి:
- హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి అందరూ మాట్లాడటం మానేశారా? తెలుగు రాష్ట్రాలలో ఎన్ని కేసులున్నాయి?
- హాయిగా నిద్ర పట్టాలంటే ఇంట్లో ఎలాంటి మార్పులు చేయాలి?
- ఆర్మీని 'అవమానించి’ సారీ చెప్పిన రిచా చద్దా... ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, నిఖిల్ ఏమన్నారు
- ఈ భారీ బిలాల రహస్యం ఏమిటి, హఠాత్తుగా భూమి ఎందుకు విస్ఫోటం చెందుతోంది?
- 'లావుగా ఉన్నావని గేలి చేశారు’ అంటూ కేరళ మంత్రి పోస్ట్, 'బాడీ షేమింగ్’పై స్కూళ్ళలో పాఠాలు చేర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)