'మి టు' ఆరోపణలపై తర్వాత మాట్లాడుతా: ఎంజే అక్బర్ రాజీనామా చేశారా?
న్యూఢిల్లీ: 'మి టూ' ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన తన రాజీనామా పత్రాన్ని ఆదివారం నాడు మెయిల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారని చెబుతున్నారు. అయితే, ఆయన ఇంకా రాజీనామా చేయలేదని మరో వాదన వినిపిస్తోంది. ప్రధాని ఆయన వాదన విన్నాక నిర్ణయం ఉంటుందని అంటున్నారు.
అంతకుముందు, అక్బర్ నేడు తన విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనను మీడియా ప్రతినిధులు ఆరోపణలపై ప్రశ్నించారు. ఆయనను చుట్టుముట్టిన జర్నలిస్టులు... అరోపణలపై స్పందించాలని అడగ్గా.. తనపై వచ్చిన విషయంపై తాను తర్వాత మాట్లాడతానని అన్నారు.

'దీనిపై నేను తర్వాత ప్రకటన విడుదల చేస్తాను' అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, అక్బర్‌పై చర్యలు తీసుకునేందుకు బీజేపీ కూడా సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో దీనిపై స్పందించాలంటూ ప్రధాని మోడీ, ఇతర మంత్రివర్గ సహచరులకు ప్రశ్నలు ఎదురవుతుండటంతో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఎంజే అక్బర్ సంపాదకునిగా ఉన్నప్పుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పలువురు మహిళా పాత్రికేయులు 'మి టూ' ఉద్యమంలో భాగంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కొందరు విదేశీ మహిళా పాత్రికేయులు కూడా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications