లఖింపూర్ ఖేరి హింసాకాండ; తన కొడుకు ఉన్నాడని రుజువు చేస్తే రాజీనామా చేస్తా : మంత్రి అజయ్ మిశ్రా
లఖింపూర్ ఖేరిలో ఆదివారం జరిగిన హింసాకాండలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రమేయం గురించి ఒక్క ఆధారమైనా ఉంటే తాను తన పదవికి రాజీనామా చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా చెప్పారు. లఖింపూర్ ఖేరి హింసాకాండకు అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారణమని రైతులు ఆందోళన చేయడంతో సోమవారం ఆశిష్ మిశ్రా పై ఎఫ్ఐఆర్ దాఖలు అయ్యింది. ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతుల కుటుంబాలతో పాటు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఆశిష్ మిశ్రాపై హత్య ఆరోపణలను ఖండించిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా
ఇదిలా ఉంటే లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాకాండకు సంబంధించి తన కుమారుడిపై వస్తున్న హత్య ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా మరోమారు ఖండించారు. తన కుమారుడికి ఈ ఘటనతో సంబంధం లేదని చెప్పారు. అసలు ఘటన జరిగిన సమయంలో తన కుమారుడు అక్కడ లేడని అజయ్ మిశ్రా తేల్చి చెప్పారు. తన కుమారుడు ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళాడని అందుకు సంబంధించిన వీడియో, ఫోటో సాక్ష్యాలు కూడా ఉన్నాయని మంత్రి అజయ్ మిశ్రా పేర్కొన్నారు.

విచారణలో అన్నీ తేలుతాయన్న అజయ్ మిశ్రా
అంతేకాదు మన దేశంలో, ఒక నియమం ఉందని,ఏదైనా తప్పు జరిగిందని భావిస్తే ప్రతి ఒక్కరికీ ఫిర్యాదు చేసే హక్కు ఉందని పేర్కొన్నారు మంత్రి అజయ్ మిశ్రా . సాక్ష్యాల సేకరణ సమయంలో, ప్రతిదీ స్పష్టమవుతుందని అజయ్ మిశ్రా తెలిపారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు కాల్ రికార్డుల వివరాలను పరిశీలించవచ్చని, మొబైల్ లొకేషన్ మొదలైనవన్నీ తనిఖీ చెయ్యొచ్చు అని వెల్లడించారు.
దర్యాప్తులో ఈ సంఘటన జరిగినప్పుడు తన కొడుకు అక్కడ లేడని స్పష్టంగా తెలుస్తుందని ఆయన మరోమారు స్పష్టం చేశారు . దర్యాప్తు సంస్థల ముందు విచారణ ఎదుర్కోవడానికి ఆశిష్ మిశ్రా సిద్ధంగా ఉన్నాడని అజయ్ మిశ్రా చెప్పాడు.

ఓ స్కూల్ కుస్తీ పోటీల్లో ఆదివారం ఆశిష్ మిశ్రా ఉన్నాడన్న అజయ్ మిశ్రా
తన కుమారుడు ఆదివారం రోజు పాఠశాలలో కుస్తీ పోటీల కార్యక్రమంలో ఉన్నారని, హింసాకాండ జరిగిన సమయంలో తన కుమారుడు లేడని మరోమారు స్పష్టం చేశారు. లఖింపూర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపై వాహనం నడుపుతున్నట్లు పేర్కొన్న వీడియో గురించి, అజయ్ మిశ్రా మాట్లాడారు. ఆ వీడియోలో, రైతుల ప్రాణాలు పోయేలా విధ్వంసకర రీతిలో వాహనం నడిపిన డ్రైవర్ అక్కడికక్కడే కొట్టి చంపబడినట్లు స్పష్టంగా చూడవచ్చు అని పేర్కొన్నారు అజయ్ మిశ్రా .
కాబట్టి, రైతులపైకి వాహనంతో దూసుకుపోయింది తన కొడుకు అయితే, తన కొడుకు చనిపోయేవాడని పేర్కొన్నారు. ఘర్షణలో మరణించిన బిజెపి కార్యకర్తలతో సహా బాధితులందరికీ రూ. 45 లక్షలు పరిహారం అందుతుందని, గాయపడిన వారికి రూ. 10 లక్షలు అందుతాయని ఆయన పేర్కొన్నారు.

ఆశిష్ మిశ్రా ఉన్నారని, కొడుకు తప్పించే పనిలో మంత్రి ఉన్నాడని ఆరోపణ
అయితే మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అక్కడ ఉన్నారని స్వయంగా తుపాకీతో బెదిరించారని కొందరు ఆరోపిస్తున్నారు. అజయ్ మిశ్రా వ్యాఖ్యలను రైతులు ఖండిస్తున్నారు. కొడుకును తప్పించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడుతున్నారు. రైతుల మీదకి దూసుకెళ్లిన వాహనం ఆశిష్ మిశ్రాదేనని, వాహనం రైతులు మీదకు దూసుకు వెళ్తున్న సమయంలో, ఆ వాహనంలో ఆశిష్ మిశ్రా ఉన్నారని పదేపదే ఆరోపణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications