వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేపీ నడ్డా విమర్శలపై కేటీఆర్: 'అవును, కేసీఆర్ ఏటీఎం... అన్నదాతలకు తోడుండే మెషీన్'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం చేసిన విమర్శలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం సమాధానం ఇచ్చారు.

జేపీ నడ్డాకు వ్యాఖ్యలపై ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలనే మీడియా ముందుకు వచ్చానని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు.

జేపీ నడ్డా అంటే కేంద్రంలో మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషిగా కొంత గౌరవం ఉండేదన్న కేటీఆర్.. నిన్న ఆయన మాటలు విన్న తర్వాత ఉన్న గౌరవం కూడా పోయిందని. బండి సంజయ్‌కు జేపీ నడ్డాకు తేడా లేదని అర్థమైందని అన్నారు.

నడ్డా కేసీఆర్‌పై చేసిన విమర్శలకు సమాధానంగా, "జేపీ నడ్డా.. నువ్వో పెద్ద అబద్ధాల అడ్డా... నీ కేరాఫ్‌ అడ్రస్‌ ఎర్రగడ్డ. నువ్వు వంద శాతం ఎర్రగడ్డకు పోవాల్సిన వ్యక్తివే, పొరపాటున ఇలా వచ్చావు" అన్నారు.

కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని, కేసీఆర్ మానసిక సంతులనం కోల్పోయారన్న నడ్డా విమర్శలకు కూడా కేటీఆర్ సమాదానం ఇచ్చారు.

ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రే కాళేశ్వరంలో ఏ అవినీతీ జరగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారని, అందుకే, ఎవరి మానసిక సంతులనం కోల్పోయారో మీరే ఆలోచించుకుని చెప్పాలని నడ్డాకు సూచించారు.

"అవును, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఏటీఎం....ఆయన 'అన్నదాతలకు తోడుండే మెషీన్' అని చెప్పారు.

కేసీఆర్‌ది రాజనీతిజ్ఞుడి పాలనగా చెప్పిన కేటీఆర్ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి, వాటిని ఏటీఎంలుగా మార్చుకున్న కేంద్రం సేల్స్ మాన్ పాలన చేస్తోందని విమర్శించారు.

సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ అనే నినాదంతో వచ్చిన బీజేపీ ఏడున్నరేళ్లలో అందరినీ నాశనం చేసిందని ఆయన ఆరోపించారు.

సామాన్యుడికి దేశంలో శోకం తప్ప ఏం మేలు జరగలేదన్నారు. బీజేపీ పాలనలో కామన్‌ మేన్‌కు శోకం.. కార్పొరేట్లకు కనకవర్షం కురిసిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు, మిషన్ భగీరథ లాంటి పథకాలు కాపీకొట్టి కిసాన్ సమ్మాన్, హర్ ఘర్ జల్ లాంటి పథకాలు తీసుకొచ్చారని, మా పార్టీ విధానాలను మీ ఎన్నికల నినాదాలుగా మార్చుకున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో కుటుంబ పాలన ఉందని విమర్శలు చేస్తున్నారని, కానీ అమిత్‌ షా కుమారుడికి బీసీసీఐ పదవి ఎలా వచ్చిందని కేటీఆర్ అన్నారు. గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసింది బీజేపీనే అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు 87శాతం జీతాలు పెంచిందని, బీజేపీ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే... దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని కేటీఆర్ అన్నారు.

అంతకు ముందు ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై విమర్శలు గుప్పించారు.

ఆ పార్టీ నేతల మాటలు విన్న తరవాత బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, అది బక్వాస్‌ జుమ్లా పార్టీ అని తనకు అర్థమైందని అన్నారు.

బేజేపీ దేశానికి పనికొచ్చే ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్న కేటీఆర్.. ఏడున్నరేళ్లలో ఏ వర్గానికీ చేసింది ఏమీ లేదని, సున్నా అని ఆరోపించారు.

ఆ పార్టీని ఎవరైనా విమర్శిస్తే తమ ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములుగా మారిన సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ లాంటి సంస్థలతో దాడులు చేయిస్తుందని, వ్యవస్థలతోపాటూ దిల్లీలోని కొన్ని మీడియా సంస్థలను కూడా చేతుల్లో పెట్టుకుని వాటిని మోడియాగా మార్చిందని అన్నారు.

2022కల్లా ప్రతి భారతీయుడికి ఇల్లు ఇస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, తాగునీరు, కరెంటు, టాయిలెట్ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన ప్రధాని వాటిని నెరవేర్చలేదన్నారు.

కాళేశ్వరం కేటీఆర్‌కు ఏటీఎంలా మారింది-జేపీ నడ్డా

మంగళవారం తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియా సమావేశంలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణ ఉద్యోగుల కోసం పోరాడుతున్న బీజేపీకి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తనను ప్రభుత్వం కరోనా సాకుతో విమానాశ్రయంలోనే పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో ముందుకు వెళ్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో గత రెండ్రోజులుగా జరుగుతున్న ఘటనలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం లాంటివేనని ఆయన అన్నారు.

తెలంగాణలో ఒక విధంగా నియంతృత్వం కొనసాగుతోందని, కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయుందని, రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని ఆరోపించారు.

కేసీఆర్ కుటుంబ పాలనను, అవినీతి, అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ బీజేపీ పోరాడుతుందని అన్నారు.

శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న బండి సంజయ్, ఇతర నేతలపై తెలంగాణ ప్రభుత్వం బలప్రయోగం చేసిందని, వాటర్ కానన్, టియర్ గ్యాస్ వదిలి అరెస్ట్ చేసిందని ఆరోపించారు.

దుబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ విజయంతో సీఎం కేసీఆర్ మానసిక సంతులనం కోల్పోయారని నడ్డా విమర్శించారు.

ముఖ్యమంత్రి డైరెక్షన్లో తెలంగాణ అత్యంత అవినీతి మయమైన రాష్ట్రంగా మారిందని, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని తాను రెండేళ్ల క్రితమే చెప్పానని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు మొదలుపెట్టి, నిధులు ఖర్చు చేసినా చుక్క నీళ్లు కూడా ప్రజలకు చేరడం లేదని ఆరోపించారు.

బీజేపీ కేసీఆర్ పాలనపై ధర్మయుద్ధం చేస్తోందన్న నడ్డా, తాము ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని, ఎంత అడ్డుకున్నా ఆగమని స్పష్టం చేసారు.

బండి సంజయ్‌ను అరెస్టు చేసినా తమ ధర్నాలు కొనసాగుతాయన్న ఆయన, తమ పోరాటాన్ని నిర్ణయాత్మక మలుపు వరకూ తీసుకెళ్తామని అన్నారు.

జేపీ నడ్డా వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చాక, బీజేపీ తెలంగాణ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ మరో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

"కేటీఆర్ ఫ్రస్టేషన్‌తో కేంద్రప్రభుత్వం, ప్రధానిపై ఏకవచనంతో, అసభ్య పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు.. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు టీఆర్ఎస్ మాపై ఎదురుదాడి చేస్తుంటే చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు" అన్నారు.

బండి సంజయ్

బండి సంజయ్ విడుదల

బుధవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు.

కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడులైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 317ను సవరించాలని డిమాండ్ చేసిన ఆయన, ఉద్యోగుల కోసం మరోసారి జైలుకు వెళ్లడానికి తాను సిద్ధం అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Minister KTR sattires to BJP President Nadda comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X