ఫోర్త్ వేవ్- దేశంలో కరోనా ఉధృతి: కేంద్రం హైఅలర్ట్: కఠిన నిర్ణయాల వైపు ..!!
న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తాన్నీ వణికించిన ప్రాణాంతక కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది చైనా. అక్కడి హ్యూబే ప్రావిన్స్‌లోని వుహాన్ సిటీలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి బారిన పడని దేశమంటూ లేదు. అన్ని దేశాల్లోనూ అడుగు పెట్టింది. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను తీసింది. కరోనా వైరస్ బారిన తీవ్రంగా పడిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది. 10 కోట్లకు పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. 11 లక్షల మందికి పైగా దీని బారిన పడి మరణించారు.

వ్యాక్సిన్‌తో కట్టడి..
కరోనా బారిన పడి పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని చవి చూసిన దేశాల జాబితాలో రెండో స్థానంలో భారత్ నిలిచింది. నాలుగున్నర కోట్లకు పైగా పాజిటివ్ కేసులు భారత్‌లో నమోదయ్యాయి. అయిదున్నర లక్షల మంది మృతి చెందారు. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి భారత్ సహా కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత దీని తీవ్రత తగ్గింది. పూర్తిగా నిర్మూలించకపోయినప్పటికీ- అన్ని దేశాల్లోనూ ఈ మహమ్మారి విస్తరించే వేగం అదుపులోకి వచ్చింది. మాస్కులను ధరించాల్సిన అవసరం లేనంతగా దీని తీవ్రత తగ్గిపోయింది.

కొత్త కేసులు..
ఇప్పుడు మళ్లీ చైనాలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దాని తీవ్రత విస్తరించింది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు సైతం సంభవిస్తోన్నాయి. కోవిడ్ పేషెంట్లతో ఆసుపత్రులు, క్లినిక్స్, స్పెషల్ వార్డులు భర్తీ అయ్యాయి. కొత్త పేషెంట్ల కోసం బెడ్స్ దొరకని దుస్థితిని ఎదుర్కొంటోంది డ్రాగన్ కంట్రీ. మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించడానికి కూడా చోటు దక్కని దుర్భర పరిస్థితులు చైనాలో ఏర్పడ్డాయి.

భారత్ అప్రమత్తం..
ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, బ్రెజిల్‌లల్లో కోవిడ్ తీవ్రత పెరిగింది. భారత్‌లో కూడా కోవిడ్ కేసుల ఉధృతి ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. కొత్త కేసులు వెలుగులోకి వస్తోన్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు బయటపడుతున్నాయి. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యాన్ని వహించలేని పరిస్థితి దేశంలో నెలకొంది. సెకెండ్ వేవ్ తరహా దుర్భర పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తం కావాల్సి ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

కేంద్రమంత్రి సమీక్ష..
ఈ పరిణామాల మధ్య కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ భాయ్ మాండవీయ ఇవ్వాళ సమీక్ష చేపట్టారు. కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలో ఈ సమీక్ష ఆరంభమైంది. ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఆయుష్, ఫార్మాసూటికల్స్ డిపార్ట్‌మెంట్, బయోటెక్నాలజీ విభాగం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బెహల్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఛైర్మన్ అరోరా, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కోవిడ్ కేసుల ఉధృతిని దృష్టిలో పెట్టుకుని కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications