లఖింపూర్ ఖేరీ హింసాకాండ: కేంద్రమంత్రి కుమారుడికి సమన్లు, ఇద్దరి అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపుర్ ఖేరి హింసాకాండ కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటోన్న కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు గురువారం పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన్ను విచారించే నిమిత్తం ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో భాగంగా ఆయనపై మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
లఖింపుర్ ఖేరి కేసులో ఇప్పటివరకు ఎంతమందిని అరెస్టు చేశారంటూ గురువారం సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆశిష్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఆయన్ను సాధ్యమైనంత త్వరగా ప్రశ్నించనున్నాం. ఆయనపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా, ఆశిష్‌పై సోమవారమే ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అలాగే ఆ హింసాకాండకు సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు ఆధారాలు లభించినట్లు పోలీసులు చెప్పారు. మరోపక్క ఆశిష్ మిశ్రాను శుక్రవారంలోగా అరెస్టు చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తానని పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ హెచ్చరించారు. లఖింపూర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయన్ను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కోసం పోలీసులు గాలిస్తున్నారని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. లఖింపుర్ ఘటనలో హత్యారోపణలు ఎదుర్కొంటోన్న ఆయన్ను సాధ్యమైనంత త్వరలో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆ ప్రాంతంలో నిరసన తెలుపుతోన్న రైతులపై ఆశిష్ కాల్పులు జరిపాడని, వారిపై నుంచి దూసుకెళ్లిన కారులో మంత్రి కుమారుడు ఉన్నాడని ఎఫ్‌ఐఆర్‌ను బట్టి అర్థమవుతోంది. అలాగే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సమాచారం కూడా ఈ కేసు దర్యాప్తులో ఉపయోగించనున్నామని అని ఆ అధికారి పేర్కొన్నారు.
Recommended Video
మరోవైపు, తనపై వస్తోన్న ఆరోపణలను గతంలోనే ఆశిష్ మిశ్రా కొట్టిపారేశారు. 'నేను ఆ సమయంలో బన్వారీపూర్‌లో ఉన్నాను. ఉదయం తొమ్మిది నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నాను. నాపై మోపిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి. దీనిపై న్యాయ విచారణ జరగాలి. దోషులకు శిక్ష పడాలి అంటూ మీడియాతో వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కూడా తన కుమారుడు లఖింపూర్ ఖేరీ ఘటన సమయంలో అక్కడ లేరని స్పష్టం చేశారు. తన కుమారుడు అక్కడేవున్నాడని నిరూపించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications